జనసేన పార్టీకి తొలి షాక్ తగిలింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని
అమరావతిలో పార్టీ కార్యాలయం కోసం సుమారు మూడెకరాల భూమిని జనసేన పార్టీ
లీజుకి తీసుకున్న విషయం విదితమే. లీజు ఒప్పందాల ప్రక్రియ పూర్తయ్యాక,
తాజాగా ఆ భూమికి సంబంధించి వివాదం తెరపైకొచ్చింది. అసలు ఆ భూమి లీజుకిచ్చిన
వ్యక్తిది కానే కాదనీ, ఆ భూమి తమకు చెందినదంటూ ముస్లిం సంఘాల నేతలు
ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వివాదం కోర్టులో వుందనీ, ఆ విషయం దాచిపెట్టి,
భూమిని జనసేన పార్టీకి లీజుకి ఇచ్చారన్నది ముస్లిం సంఘాల నేతల ఆరోపణ.
భూముల వ్యవహారంలో ఇలాంటి లిటిగేషన్లు మామూలే. రాజకీయ పార్టీలు
కావొచ్చు.. వ్యక్తులు కావొచ్చు.. భూములు కొనుగోళ్ళు, లీజుల విషయంలో
అప్రమత్తంగా వుండి తీరాల్సిందే. అయితే, జనసేన పార్టీ తరఫున ముందస్తుగానే
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వివాదాన్ని పసిగట్టలేకపోయారన్న వాదనలు
విన్పిస్తున్నాయి. వ్యవహారం పవన్‌కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళినట్లు
తెలుస్తోంది.
ఇదిలా వుంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పార్టీ
కార్యాలయాల్ని స్థాపించేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ముందుగా
అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ మేరకు
అనంతపురంలో ఇప్పటికే కొంత భూమిని కూడా ఎంపిక చేసుకుంది జనసేన పార్టీ.
ప్రతి జిల్లాలోనూ రెండు నుంచి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ
కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలన్నది జనసేన అధినేత ఆలోచన. కేవలం పార్టీ
కార్యాలయం అనే కాకుండా, విజ్ఞన భాండాగారంలా వుండాలనే దిశగా ఆయా
కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి ఖచ్చితమైన ఆలోచనలతో జనసేన
పార్టీ ముందడుగు వేస్తోంది. అయితే, తొలి అడుగు.. అదీ రాజధాని అమరావతిలో ఇలా
వివాదాస్పదమవడం జనసేన పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన విషయమే.
కాగా, ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అది వివాదాస్పద స్థలమైతే,
తాను విజయవాడ వచ్చినప్పుడే ఆ విషయాన్ని తనకు తెలియజేసి వుండాలనీ, ఓ రాజకీయ
నేత సమక్షంలో ఈ విషయాల్ని లేవనెత్తడం పట్ల పలు అనుమానాలు
వ్యక్తమవుతున్నాయని అన్నారాయన. త్వరలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, న్యాయ
నిపుణులతో కలిసి ఆ స్థల వివాదమై విజయవాడకి రానున్నారనీ, స్థలం
వివాదాస్పదమైనదన్న ఆరోపణలు నిజమైతే, ఆ స్థలానికి జనసేన దూరంగా వుండడానికీ
వెనుకాడదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఒకవేళ వివాదంంలో రాజకీయ కుట్ర
వుంటే దాన్ని తట్టుకునే శక్తి జనసేనకు వుందని పవన్ పేర్కొనడం కొసమెరుపు.
No comments:
Post a Comment