Tuesday, June 18, 2019

హరీష్ కృషిని కీర్తించకుంటే పాపమే

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది. సాగునీటి సదుపాయం పరంగా తెలంగాణకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును అంతే ఘనంగా ప్రారంభించడానికి కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సందర్భంలో కాళేశ్వరం పూర్తి కావడానికి అహరహం కష్టపడిన అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును మాత్రం ఎవ్వరూ తలచుకోకపోవడం చిత్రంగా కనిపిస్తోంది. అప్పట్లో వైస్సార్ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా పేరు మార్చడమూ, గోదావరి నీటిని మరింత సమర్థంగా, ఎక్కువగా ఉపయోగించుకోవడానికి తగినట్లు డిజైన్లు మార్చడంలో కేసీఆర్ పాత్ర ఉంది.
అయితే టీ సర్కారు పాలనలో ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడం వెనుక హరీష్ రావు కష్టం మెండుగా ఉంది. లెక్కకు మిక్కిలిగా ఆయన ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ప్రొజెక్గ్ పూర్తికి చాలా ఎక్కువ సమయం కేటాయించారు. నీటిపారుదల అవసరాలు, పరిస్థితుల మీద మంచి అవగాహన శ్రద్ద ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. రెండోసారి తెరాస ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరీష్ కు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. చాలా విషయాల్లో ఆయన దూరంగా మెలగుతున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. గోదావరి నదికి ఎగువన, దిగువన ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా స్వయంగా ఆహ్వానిస్తూ చాలా ఘనంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రకరకాల రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. అనేకమంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కాళేశ్వరం ఘనతను చాటుతున్నారు.
కేసీఆర్ ఒక సాధారణ ఇంజినీర్ లాగా పనిచేసి పూర్తి చేయించారని అంటున్నారు. నిజానికి ఆ స్థాయిలో శ్రమించింది హరీష్ రావే. ఆయన ఇప్పుడు పదవిలో లేరు. లూప్ లైన్లో ఉన్నారని ప్రచారం ఉంది. దానికి తగ్గట్లు ఆయన పేరు ఎవరూ తలచుకోవడం లేదు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్బంగా హరీష్ శ్రమను గుర్తించకపోవడం పాపమే అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

No comments:

Post a Comment