Monday, July 22, 2019

రౌడీ పీక్స్‌కు తీసుకెళ్తాడా?

టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఊపందుకుంది. ముందు వారాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ లాంటి డీసెంట్ హిట్లు పడ్డాయి. ‘నిను వీడని నీడను నేనే’ కూడా పర్వాలేదనిపించింది. ఇక గత వారం వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా వసూళ్ల మోత మోగిస్తోందో తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండానే ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక ఈ వారం రాబోయే ‘డియర్ కామ్రేడ్’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ‘గీత గోవిందం’ స్థాయిలో జనాలు ఈ చిత్రం కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ట్రీట్ ఇస్తుంటే.. ‘డియర్ కామ్రేడ్’ ప్రధానంగా క్లాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లుంది. యూత్ ఈ చిత్రానికి బాగా కనెక్టయ్యేలా ఉన్నారు. సినిమా సినిమాకు ఎదిగిపోతున్న విజయ్ దేవరకొండ ఈసారి ఇంకొన్ని మెట్లు ఎక్కేస్తాడేమో అనిపించింది ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ చూస్తే.

ట్రెండీగా ఉండే సినిమా తీయడమే కాదు.. దాన్ని చాలా చక్కగా ప్రమోట్ చేస్తోంది ‘డియర్ కామ్రేడ్’ టీం. మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో విజయ్, రష్మిక చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సినిమాపై యూత్‌లో క్రేజ్‌ను రోజు రోజుకూ పెంచస్తోంది ఈ జంట. వీళ్లిద్దరి కెమిస్ట్రీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేట్లుంది.

సినిమాలోనే కాక.. బయట కూడా తమ కెమిస్ట్రీతో ఈ జంట ఆకట్టుకుంటోంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం విజయ్ కెరీర్లో మరో పెద్ద హిట్‌గా నిలవడం ఖాయం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.

తమిళ, మలయాళ సినిమాలతో పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్‌ ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. అతను అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ పాపులర్ అయింది.

No comments:

Post a Comment