Friday, July 5, 2019

పార్ల‌మెంట్‌లో గ‌ళ‌మెత్తిన వైసీపీ పోలీస్‌..

ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశ‌మే ఓ సంచ‌ల‌నం. పోలీస్ అధికారిగా శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో త‌న‌దైన ముద్ర‌వేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా త‌న మొద‌టి ప్ర‌సంగంతోనే జ‌నం మ‌న‌సును గెలుచుకున్నారు. స‌భ‌లో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తి తానెప్పుడూ ప్ర‌జ‌ల మ‌నిషినేన‌ని నిరూపించుకున్నారు. ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌ర‌ని ఆలోచిస్తున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌. అనంత‌పురం జిల్లా క‌దిరి సీఐగా ప‌నిచేస్తూ.. మాజీ ఎంపీ జేసీపై మీసం మెలేసి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు పార్ల‌మెంట్‌లో అనంత‌పురం జిల్లా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడిన తీరుతో మ‌రోసారి హైలెట్‌గా నిలిచారు మాధ‌వ్.

అదే వేగంగా ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. అనేక మ‌లుపులు.. అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య‌ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు గోరంట్ల మాధ‌వ్‌. పార్ల‌మెంట్‌లో నిన్న రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ఆయ‌న మాట్లాడిన తీరుపై పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అనంత‌పురం జిల్లాలో ప్ర‌జ‌ల క‌ష్టాలు, క‌రువు, రైతుల ద‌య‌నీయ స్థితిపై ఇంగ్లీష్‌లో మాట్లాడారు. అనంత‌పురం జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోన‌య్యారు. అంటే.. పోలీస్ అధికారిగా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌కు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఉన్న ప‌ట్టుకు జ‌నం ఫిదా అవుతున్నారు.

ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా అనంతపురంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని, పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల‌ని కోరారు. అలాగే.. మ‌హిళా స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక  కొందరు మ‌హిళ‌లు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాకుండా.. బాల‌కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న కోసం కూడా ఆయ‌న మాట్లాడడం గ‌మ‌నార్హం. బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నార‌ని.. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఎంపీ మాధ‌వ్ కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని, తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందని.. అదే  నేడు రూ.10 ఖర్చు చేసి బడికి పంపిస్తే.. ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు. ఏది ఏమైనా ఎంపీ మాధ‌వ్‌.. త‌న తొలిప్ర‌సంగంలోనే అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి.. ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు.

No comments:

Post a Comment