Monday, July 15, 2019

అసలైన కెప్టెన్ కూల్ ఇతనే

న్యూజిలాండ్.. ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత జట్టును ఓడించి మన అభిమానులకు గుండెకోత మిగిల్చిన జట్టు. ఆ స్థానంలో మరో జట్టు ఉన్నట్లయితే.. ఫైనల్లో చిత్తుగా ఓడిపోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ కప్పు ఆ జట్టుకు సొంతం కాకూడదని కోరుకుంటారు భారత అభిమానులు. కానీ నిన్న ఫైనల్లో ఆ జట్టు ఓడిపోతే సొంత జట్టు ఓడినంత బాధ పడ్డారు మన ఫ్యాన్స్. మ్యాచ్ మొదలవడానికి ముందే న్యూజిలాండ్ గెలవాలనే మెజారిటీ భారత అభిమానులు కోరుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

అందుక్కారణం.. జెంటిల్మన్ గేమ్‌లో ఏ వివాదాలకు తావు ఇవ్వకుండా జెంటిల్మెన్స్‌లా ప్రవర్తిస్తూ.. జెంటిల్మన్స్‌లా ఆడే న్యూజిలాండ్ ఆటగాళ్లే. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఏ స్థితిలోనూ ఉద్వేగానికి గురి కాకుండా.. ప్రత్యర్థులెవ్వరినీ పల్లెత్తు మాట అనకుండా.. ఏ వివాదానికీ తావివ్వకుండా.. తన పని తాను చేసుకుపోతుంటాడు విలియమ్సన్. ఇక అతడి బ్యాటింగ్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఐతే అతడిని మించిన బ్యాటింగ్ వీరులుండొచ్చు కానీ.. వ్యక్తిత్వంలో మాత్రం కేన్‌కు సాటి వచ్చే వాళ్లు మరొకరు కనిపించరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ప్రపంచకప్ ఫైనల్లో అతడి సంయమనం చూసి ఎవ్వరైనా షాకయ్యే ఉంటారు. మ్యాచ్ చూస్తున్న వాళ్లు టెన్షన్ తట్టుకోలేక కిందా మీద అయిపోతుంటే.. అతను మాత్రం ప్రతి సందర్భంలోనూ ప్రశాంతంగానే కనిపించాడు.

స్టోక్స్ క్యాచ్ పట్టిన బౌల్ట్ బౌండరీ లైన్‌ను తాకినప్పుడు.. గప్తిల్ త్రో వేసిన బంతి స్టోక్స్ బ్యాట్ తాకి ఓవర్ త్రో ఫోర్ వెళ్లినపుడు.. మ్యాచ్ ఒకటికి రెండుసార్లు టై అయినపుడు.. ఇలా ఏ సందర్భంలో అయినా విలియమ్సన్ ప్రశాంతంగానే ఉన్నాడు. ఇన్నాళ్లూ మన ధోనీని ‘కెప్టెన్ కూల్’ అన్నాం కానీ.. ఇలాంటి కూల్‌నెస్ అతడికి కూడా సాధ్యం కాదు. ఎలాగూ ధోని రిటైరైపోతున్నాడు కాబట్టి ఈ ట్యాగ్ విలియమ్సన్‌కు ఇచ్చేయొచ్చేమో.

No comments:

Post a Comment