Friday, July 12, 2019

సల్మాన్ కాదు.. ఆమిర్ కాదు.. అక్షయ్ కుమార్

బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ లాంటి విషయాల ప్రస్తావన వస్తే ముందు ఖాన్ త్రయం గురించే మాట్లాడుకోవాలి. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల హవా నడుస్తోంది. కాల క్రమంలో షారుఖ్ ఖాన్ రేంజ్ తగ్గింది కానీ.. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మాత్రం దూసుకెళ్తూనే ఉన్నారు.

వీళ్లు నటించే సినిమాలకు భారీగా పారితోషకం తీసుకుంటారు. అలాగే అనేక బ్రాండ్లకు ప్రచారం చేయడం ద్వారానూ భారీగా ఆదాయం పొందుతారు. అయినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక ఆదాయం పొందుతున్న హీరో సల్మాన్ కాదు.. ఆమిర్ కాదు.. షారుక్ కూడా కాదు. అక్షయ్ కుమార్ కావడం విశేషం. తాజాగా ఫొర్బ్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్న ఫిలిం సెలబ్రెటీల లిస్టు ఇచ్చింది.

ఇందులో భారత్ నుంచి అవకాశం దక్కించుకున్న నటుడు ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే కావడం విశేషం. అతను రూ.444 కోట్ల వార్షికాదాయంతో టాప్-100 లిస్టులో చోటు సంపాదించాడు. ఖాన్‌లు ఒక్కో సినిమాకు అక్షయ్ కంటే ఎక్కువ పారితోషకం తీసుకోవచ్చేమో. కానీ అక్షయ్ ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా వారిని అధిగమిస్తున్నాడు. ఏటా మూడుకు తక్కువ కాకుండా రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటాడు అక్షయ్.

గత కొన్నేళ్లలో తన రేంజ్ బాగా పెంచుకున్న అతను.. ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల దాకా పారితోషకం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అదే సమయంలో తీరిక లేకుండా ప్రకటనల్లోనూ నటిస్తుంటాడతను. ఏకంగా 20కి పైగా టాప్ బ్రాండ్స్ అతడి చేతిలో ఉన్నాయి. సినిమాల ద్వారా సంపాదించే దానికి ఎన్నో రెట్లు వాణిజ్య ఒప్పందాల రూపంలో ఆర్జిస్తున్నాడు అక్షయ్. అందుకే అతను ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

No comments:

Post a Comment