Monday, July 8, 2019

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్‌!

భారతీయ మూవీమేకర్లు నైతికంగా కొంచెం ఎదిగారు. దశాబ్దాలుగా కాపీ కొట్టేవాళ్లు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. ఇదివరకూ బోలెడన్ని సినిమాలను హాలీవుడ్‌ నుంచినో, మరో విదేశీ చిత్రసీమ నుంచినే కాపీకొడుతూ వచ్చారు భారతీయ మూవీమేకర్లు. ఈ జాబితా అంతాఇంతా కాదు. బోలెడన్ని సినిమాలు కాపీలే. విదేశంలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలను యథాతథంగా కాపీ కొట్టినవాళ్లు కొందరు అయితే, వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఆ కథలను దేశీయంగా మార్చి రూపొందించిన వారు ఇంకొందు. కథను మాత్రమే కాపీ కొట్టినవారు కొందరైతే, స్క్రిప్ట్‌ను కూడా యథాతథంగా దించేసినవాళ్లు, డైలాగులను కూడా అనుకరించినవాళ్లు ఇంకొందరు.
అలాంటి కాపీ రాయుళ్లలో దేశీయంగా సూపర్‌స్టార్లు ఉన్నారు. మనదగ్గర స్టార్‌ రైటర్లుగా, స్టార్‌ డైరెక్టర్లుగా, స్టార్‌ మూవీ మేకర్లుగా చలామణి అవుతున్న అనేకమంది అలాంటి కాపీ బాపతు సినిమాలనే రూపొందించారు. కాపీ కొట్టి సినిమాలను తీశారు. ఆ విషయంలో విమర్శలు వచ్చినా వారు వెనక్కు తగ్గలేదు. కాపీ కొట్టే సినిమాలను తీయడం పనిగా పెట్టుకున్న వాళ్లున్నారు. వాళ్లే స్టార్లుగా చలామణి అవుతున్నారు. అలాంటి కాపీ పురాణం గురించి చెబితే అదో పెద్ద కథే అవుతుంది. ఎపిసోడ్లకు ఎపిసోడ్లు రాసుకోగదిన కాపీ వ్యవహారాలున్నాయి. అయితే ఆ తీరులో ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తూ ఉండటం గమనార్హం.
ఇదివరకూ సినిమా తెరమీద పడిందంటే చాలు.. అది ఏ విదేశీ సినిమాకు కాపీ అనే అంశం గురించి చర్చ మొదలయ్యేది. ఆ సినిమాలను ఎక్కడ నుంచి కాపీకొట్టారో ప్రేక్షకులే కనిపెట్టే వాళ్లు. తీరా సినిమా విడుదల అయ్యాకా సదరు మూవీమేకర్లు దొరికిపోయేవాళ్లు! అలా దొరికిన వాళ్లలో పేరెన్నిక గల రచయితలు, దర్శకులు ఉన్నారు. తెలుగునాట అయితే ఎస్‌ఎస్‌ రాజమౌళి, త్రివిక్రమ్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు కూడా కాపీ కంటెంట్‌తో పట్టుబడ్డారు. టైటిల్‌ రోల్స్‌లో ఆ సినిమా క్రెడిట్‌ అంతా తమదే అని వేసుకుంటారు. తీరాచూస్తే కాపీ కొట్టి ఉంటారు. వీళ్లు సీన్‌ టు సీన్‌ కాపీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవేమిటో ప్రేక్షకులకు ఉదాహరించాల్సిన అవసరం లేదు.
స్టార్‌ డైరెక్టర్లు అయినప్పటికీ, భారీ బడ్జెట్‌ సినిమాలే రూపొందించినప్పటికీ వారు కంటెంట్‌ విషయంలో మాత్రం కాపీ పోకడలకే వెళ్లారు. అలాంటి భావ దారిద్రం దశాబ్దాల పాటు ఇండియన్‌ సినిమాలో కొనసాగింది. తాము కాపీ కొట్టినప్పుడు దాని ఒరిజనల్‌ రైట్స్‌ ఉన్న వాళ్ల పేర్లను పేర్కొనడం ఒక ఉత్తమమైన లక్షణం. అయితే అలాంటి లక్షణాలు మన వాళ్ల వద్ద కనిపించలేదు. ఎలాంటి హక్కులనూ తీసుకోకుండా కాపీకొట్టడమే కాకుండా, దాని క్రెడిట్‌ అంతా తమదే అన్నట్టుగా వారు వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే రోజులు మారాయి. ఇప్పుడు ఎవరిని ఎవరు కాపీ కొట్టినా ఇట్టే దొరికిపోతూ ఉన్నారు. ఆఖరికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను కాపీకొట్టే వాళ్లను కూడా ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. ఎవరు ఎక్కడ నుంచి ఎలా కాపీ కొట్టారో ప్రేక్షకులే కనుగొని పట్టించేస్తూ ఉన్నారు. కాపీ రాయుళ్ల కథ సోషల్‌ మీడియాకు ఎక్కుతోంది. వీడియోలతో సహా కాపీ ఆధారాలను చూపించేస్తున్నారు. అందుకే మూవీ మేకర్లలో కూడా మార్పు వచ్చినట్టుగా ఉంది. ఇప్పటికీ విదేశీ సినిమాల నుంచి స్ఫూర్తి పొందే పద్ధతి ఏమీ కనుమరుగు కావడం లేదు కానీ.. ఇప్పుడు అధికారికంగా వాటిని అనుసరిస్తూ ఉన్నారు.
హక్కులను కొనుగోలు చేసి.. ఆ సినిమాలను రీమేక్‌ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కాపీకొట్టేసి.. గప్‌ చుప్‌గా సినిమాలు తీసేసేవాళ్లు. అంతా తమదే క్రెడిట్‌ అనేవాళ్లు. ఇప్పుడు మాత్రం తాము ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందామనే విషయం గురించి మూవీమేకర్లు అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. సదరు ఒరిజినల్‌ మూవీ మేకర్లకు డబ్బులు చెల్లించి వీళ్లు హక్కులు కొనుగోలు చేసి ఆ సినిమాలను రీమేక్‌ చేస్తే ఉన్నారు. దీన్ని ఆక్షేపించడానికి వీల్లేదు. ఇదివరకూ పక్కభాషల సినిమాలను రీమేక్‌ చేసేవాళ్లు. పక్కభాషల్లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను, ఆకట్టుకున్న సినిమాలను రీమేక్‌ చేసేవాళ్లు.
అలాంటి సినిమాలను కాపీ కొట్టడానికి వీలు లేకపోయేది. ఎందుకంటే పక్క భాష నుంచినో, హిందీ నుంచినో కాపీకొడితే వ్యవహారం కోర్టులకు వెళుతుంది. అందుకే అలాంటి సినిమాల హక్కులకు డబ్బులు పెట్టి రీమేక్‌ చేసేవాళ్లు. ఇప్పడు విదేశాల వాళ్లు కూడా అలర్ట్‌ అయ్యారు. తమ సినిమాలను ఎవరైనా కాపీ కొట్టారని తెలిస్తే వాళ్లు ఇండియాకు వచ్చి కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. కొన్ని బాలీవుడ్‌ సినిమాలకు అలాంటి అనుభవం ఎదురైంది.
ఎవరికీ తెలీదని గప్‌చుప్‌గా సినిమాలు రూపొదించేశారు. ఆ సినిమాలు హిట్‌ కూడా అయ్యాయి. తీరా హిట్‌ అయ్యాకా.. భారీ కలెక్షన్లు వచ్చాకా.. సదరు సినిమాను ఎక్కడ నుంచి కాపీకొట్టారో బయటపడిపోయింది. దీంతో ఆ మూవీమేకర్లు అభ్యంతరం చెబుతూ ఇండియన్‌ కోర్ట్స్‌లోనే పిటిషన్లు దాఖలు చేశారు. నష్ట పరిహారం డిమాండ్లను కోరారు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు అలాంటి పరిస్థితి ఎదురైంది. సూపర్‌ హిట్‌ అయిన సల్మాన్‌ఖాన్‌- గోవిందల సినిమా 'పార్ట్‌నర్‌'ను ఒక హాలీవుడ్‌ సినిమా స్ఫూర్తితో తీశారు. దాదాపు పన్నెండేళ్ల కిందట వచ్చిన పార్ట్‌నర్‌ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. దీంతో అసలు మూవీమేకర్లు రంగంలోక దిగారు కోర్టుకు ఎక్కారు.
పన్నెండేళ్ల కిందటే అలాంటి పరిస్థితి ఉందంటే.. ఇప్పుడు కాపీకొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు. ఇటీవలి పవన్‌ కల్యాణ్‌ సినిమా 'అజ్ఞాతవాసి'కి అలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. 'లార్గోవించ్‌'ను కాపీ కొట్టి 'అజ్ఞాతవాసి' రూపొందించగా.. తీరా సినిమా విడుదల అయ్యాకా ఒరిజినల్‌ దర్శకుడు తగులుకున్నాడు. చివరకు ఏదో సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్టున్నారు. ఇలాంటి ఉదాహరణల నేపథ్యంలో మూవీమేకర్లు అలర్ట్‌ అయ్యి తాము కాపీ కొట్టదలుచుకున్న సినిమా రైట్స్‌ను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రకటించేసి మరీ సినిమాలను రూపొందిస్తున్నారు.
ఇటీవలి బాలీవుడ్‌ సినిమా 'భారత్‌' అలాంటి బాపతే. ఒక విదేశీ సినిమాను స్వదేశీకరణ చేసి ఆ సినిమాను రూపొందించారు. అయితే కాపీ కొట్టకుండా అధికారికంగా హక్కులు కొనుగోలు చేసి ఆ సినిమాను రీమేక్‌ చేశారు. ఇక తెలుగులో ఈ వారంలో విడుదల అయిన 'ఓహ్‌ బేబీ' సినిమా కూడా కొరియన్‌ సినిమా 'మిస్‌ గ్రానీ'కి రీమేక్‌ అనే సంగతి తెలిసిందే. సాధారణంగా మనోళ్లు కాపీ కొట్టే సినిమాల్లో కొరియన్‌ భాషవి కూడా ముందుంటాయి.
సౌత్‌ కొరియాలో హిట్‌ అయిన బోలెడన్ని సినిమాలను ఇండియన్‌ మూవీమేకర్లు కాపీ కొట్టి తీశారు. తెలుగులో అయితే నాని హీరోగా నటించిన 'పిల్ల జమీందార్‌' ఆ మధ్య వచ్చిన 'నెక్ట్స్‌ నువ్వే' వంటి సినిమాలన్నీ అలాంటి బాపతే. ఇంకా బోలెడన్ని కొరియన్‌ సినిమాలను ఇండియన్‌ మూవీమేకర్లు కాపీకొట్టారు. ఆ తీరులో స్వల్ప మార్పుగా అధికారికంగా 'మిస్‌ గ్రానీ'రైట్స్‌ను కొనుగోలు చేసి రీమేక్‌ చేసి విడుదల చేశారు.
ఈ తీరు అభినందనీయమే. ప్రస్తుతం మేకింగ్‌ దశలో ఉన్న వివిధ సినిమాలు ఈ తరహాలోనే రూపొందుతున్నాయి. కాపీ కాకుండా.. అధికారికంగా హక్కులు కొనుగోలు చేసి రూపొందిస్తున్నారు. దొంగచాటుగా రూపొందించినట్టుగా కాకుండా అధికారికంగా హక్కులు కొని రూపొందించడం సినిమా మేకర్ల నిజాయితీని చాటుతుంది.
Source : Greatandhra

No comments:

Post a Comment