Monday, July 8, 2019

ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్.. ఆయనకిచ్చేయాల్సిందే

సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. రామానాయుడు అన్ని రకాల సినిమాలూ చేసేవారు కానీ.. సురేష్ బాబు మాత్రం నిర్మాతగా పెద్ద సినిమాలే చేసేవారు. కానీ మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురవడంతో ఆయన ప్రొడక్షన్‌ తగ్గించేశారు. వేరే వాళ్లు తీసిన చిన్న సినిమాల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రమోట్ చేయడం, వాటికి థియేటర్లు ఇప్పించి రిలీజ్‌కు సహకరించడం.. లాంటి పనులకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో యంగ్ టాలెంట్‌ను బాగా వెలుగులోకి తీసుకొచ్చారాయన. ఈ మధ్య మళ్లీ ఆయనలో ప్రొడక్షన్లోనూ ఇదే ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్లో న్యూవేవ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు సురేష్ బాబు.

నెల రోజుల వ్యవధిలో సురేష్ బాబు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ కావడం.. ఆ నాలుగు కూడా కొత్తదనం ఉన్నవి, ట్రెండీ సినిమాలు కావడం విశేషం. ముందుగా గత నెలలో సురేష్ బాబు సంస్థ నుంచి ‘మల్లేశం’ లాంటి మంచి సినిమా వచ్చింది. తెలంగాణ రూరల్ నేటివిటీతో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. చింతకింది మల్లేశం జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ ఇన్‌స్పిరేషనల్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితం దక్కింది. ఇక యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ‘బ్రోచేవారెవరురా’ తర్వాతి వారం సురేష్ బాబు సంస్థ నుంచే విడుదలైంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. కలెక్షన్లూ వచ్చాయి. ఇలాంటి సినిమాకు సపోర్ట్ ఇచ్చి సురేష్ బాబు ప్రశంసలందుకున్నారు.

ఇక సురేష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ ఈ వీకెండ్లోనే విడుదలై ఘనవిజయం దిశగా సాగుతోంది. ఇది కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక తర్వాతి వారం సురేష్ సంస్థ నుంచి ‘దొరసాని’ వస్తోంది. అది కూడా కొత్తదనం ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఇది మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన సినిమా. సురేష్ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి నాలుగు వారాల్లో నాలుగు మంచి సినిమాలతో సురేష్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఏడాది పెద్ద హిట్లు ఎవరు కొట్టినా.. కొత్త తరహా సినిమాలతో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలవబోయేది సురేషే అనడంలో సందేహం లేదు

No comments:

Post a Comment