Monday, May 18, 2020

‘మ‌హాన‌టి’ ద‌ర్శ‌కుడికి ప్రేక్ష‌కులంటే చిన్న చూపా?

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా  తెర‌కెక్కిన ‘మ‌హాన‌టి’ సినిమా సూప‌ర్‌హిట్ అయింది. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఆ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇంత‌కూ సినిమాను ఇంత క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కించిన, మ‌రోసారి మ‌హాన‌టి సావిత్రిని క‌ళ్లెదుట ఆవిష్క‌రించిన ఆ మ‌హానుభావుడు ఎవ‌ర‌బ్బా అని సినీ అభిమానులు ఆరా తీయ‌డం ప్రారంభిం చారు. ఆ అద్భుత ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అని తెలుసుకుని పెద్ద‌లు ఆశీర్వ‌దించారు, చిన్న‌వాళ్లు అభినందించారు.
2018లో విడుద‌లైన మ‌హాన‌టి సినిమా జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ చిత్రంగా  పేరు పొందింది. 2018లో విడుదలైన దక్షిణాది చిత్రాల్లో టాలీవుడ్ నుంచి ఉత్త‌మ చిత్రంగా , ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా నాగ్ అశ్విన్‌,  ఉత్త‌మ న‌టిగా సావిత్రి పాత్ర‌లో జీవించిన కీర్తిసురేష్ అవార్డులు అందుకున్నారు. `మ‌హాన‌టి`తో జాతీయ అవార్డును గెలుచుకున్న నాగ్  త‌ర్వాత సినిమాకు గ్యాప్ తీసుకున్నారు.
తాజాగా నాగ్ అశ్విన్ నుంచి వెలువ‌డిన ఓ ట్వీట్ ప్రేక్ష‌కుల్ని కించ‌ప‌రిచేలా ఉంది. మ‌న‌మంతా ఎంతో అభిమానించే ద‌ర్శ‌కుడు నాగ్ నుంచి వచ్చిన ట్వీటేనా అని ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సి వ‌స్తోంది. లాక్‌డౌన్ త‌ర్వాత థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలంటే ఏం చేయాల‌ని నాగ్ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆయ‌న ఆగి ఉంటే బాగుండేది. కానీ ఆయ‌న మరింత ముందుకెళ్లి థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావాలంటే అంటూ కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.
‘ప్రేక్ష‌కుల‌కు వైన్‌, బీర్ అందించే విధంగా థియేట‌ర్లు క‌నుక లైసెన్స్ పొందితే సినిమా చూడ్డానికి వ‌చ్చే సంఖ్య పెరుగుతుందా అని ఓ సారి సురేష్‌బాబు, రానా మాట్లాడుకున్నాం. ఇలా చేస్తే థియేట‌ర్ వ్యాపారం మెరుగుప‌డుతుందా? అని చ‌ర్చించుకున్నాం. ఈ విష‌యంపై మీరేమ‌నుకుంటున్నారు. ఇది మంచి ఆలోచ‌నా? లేదా చెడు ఆలోచ‌నా? ఏది ఏమైనా ఒక‌టి మాత్రం నిజం....ఒక‌వేళ ఈ ఆలోచ‌నే అమ‌లు చేస్తే సినిమాకు వ‌చ్చే ఫ్యామిలీ ఆడియ‌న్స్ త‌గ్గిపోతారు. అంతేకాకుండా వైన్‌, బీర్ అందించే ఆలోచ‌న కేవ లం కొన్ని మ‌ల్టీఫ్లెక్స్ ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌చ్చు. కాని ఇది పూర్తి ప‌రిష్కారం కాదు. థియేట‌ర్లు ఓపెన్ చేయ‌గానే మీరు సినిమా చూడ‌టానికి వ‌స్తారా ?  లేదా ఇంకొంత కాలం వేచి చూస్తారా?’ అని నాగ్ అశ్విన్ నెటిజ‌న్ల‌ను అడిగారు.
ప్రేక్ష‌కులంటే దేవుళ్ల‌గా భావించే సినీ పెద్ద‌ల‌ను చూశాం. సినిమా అంటే క‌ళామ‌త‌ల్లిగా ప్రేక్ష‌కులు, సినీ ప‌రిశ్ర‌మ‌తో సంబంధం ఉన్న‌వాళ్లు ఆరాధిస్తారు. సినిమాతో ప్రేక్ష‌కుల సంబంధం త‌ల్లీబిడ్డ‌ల అనుబంధం లాంటిది. మంచి సినిమా తీస్తే క‌ళ్ల‌క‌ద్ద‌కుని ఒక‌టికి ప‌దిసార్లు చూసి మ‌రో ప్ర‌పంచంలో విహ‌రిస్తారు. అంతెందుకు రెండేళ్ల క్రితం ఇదే నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ‘మ‌హాన‌టి’  సినిమా బంప‌ర్ హిట్ కావ‌డానికి ప్రేక్ష‌కాద‌ర‌ణ కార‌ణం కాదా? ఆ రోజు ‘మ‌హాన‌టి’ విడుద‌ల చేసిన థియేట‌ర్ల‌లో వైన్‌, బీర్ ఏర్పాట్లు ఏవైనా చేశారా?  లేక‌  ‘మ‌హాన‌టి’ సినిమాను థియేట‌ర్ల‌కు బ‌దులు మ‌ద్యం దుకాణాల్లో ఏమైనా విడుద‌ల చేశారా?  నాగ్ అశ్విన్ ట్వీట్ చూసిన త‌ర్వాత ఓ ప్రేక్ష‌కుడిగా నాలో క‌లుగుతున్న అనుమానాలివి.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా లీడ‌ర్‌, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌కు ప‌నిచేసిన అనుభ‌వం నాగ్‌కు ఉంది. అలాగే ద‌ర్శ‌కునిగా మొద‌టి చిత్రం ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లై మ‌హాన‌టితో జాతీయ‌స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నుంచి ప్రేక్ష‌కుల‌పై ఇలాంటి చౌక‌బారు కామెంట్స్ రావ‌డం బాధ, ఆవేద‌న క‌లిగిస్తున్నాయి. ఇదేదో ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా ట్వీట్ చేసి ఉంటార‌ని భావించ‌డం లేదు. కానీ ఓ మంచి ద‌ర్శ‌కుడిగా అభిమానించే, ఆరాధించే నాగ్ అశ్విన్ నుంచి దేవుళ్ల‌గా భావించే ప్రేక్ష‌కుల్ని కించ‌ప‌రిచేలా ట్వీట్ రావ‌డం మ‌న‌సును కెలుకుతోంది. త‌న ట్వీట్‌పై నాగ్ మ‌రోసారి పున‌రాలోచిస్తే ఆయ‌న గౌర‌వానికే మంచిది.

No comments:

Post a Comment