Thursday, February 18, 2021

ఐదు సినిమాల రిలీజ్ ప్ర‌‌క‌టించిన టాప్ బేన‌ర్

బాలీవుడ్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న బేన‌ర్ల‌లో య‌శ్ రాజ్ ఫిలిమ్స్ ఒక‌టి. 50 ఏళ్ల ఘ‌న ప్ర‌స్థానం ఆ సంస్థ‌ది. ఏడాదిగా ఆ సంబ‌రాల‌ను కొన‌సాగిస్తోందా సంస్థ‌. గ‌త ఏడాది క‌రోనా లేకుంటే 50వ వార్షికోత్స‌వాన్ని గ‌త ఏడాది వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ చేయ‌డం ద్వారా సెల‌బ్రేట్ చేయాల‌ని అనుకుంది య‌శ్ రాజ్ ఫిలిమ్స్. కానీ వైర‌స్ ఆ ప్ర‌ణాళిక‌ల్ని దెబ్బ తీసింది. ఐతే కొత్త ఏడాదిలో య‌శ్ రాజ్ ఫిలిమ్స్ పేరు మార్మోగేలా ప‌క్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది ఆ సంస్థ‌. ఈ ఏడాది ఐదు సినిమాలు త‌మ సంస్థ నుంచి రాబోతున్న‌ట్లు వెల్ల‌డించిన యశ్ రాజ్ ఫిలిమ్స్.. ఆ ఐదు చిత్రాల రిలీజ్ డేట్ల‌ను ఒకే రోజు ప్ర‌క‌టించ‌డం విశేషం. ముందుగా అర్జున్ క‌పూర్, ప‌రిణీతి చోప్రా జంట‌గా దివాక‌ర్ బెన‌ర్జీ రూపొందించిన సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్‌ను మార్చి 19న విడుద‌ల చేయ‌బోతోంది య‌శ్ రాజ్ ఫిలిమ్స్. త‌ర్వాత త‌మ సంస్థ సూప‌ర్ హిట్ల‌లో ఒక‌టైన బంటీ ఔర్ బ‌బ్లీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన చిత్రాన్ని ఏప్రిల్ 23న రిలీజ్ చేయ‌నున్నారు. వ‌రుణ్ శ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖుర్జీ, సిద్దాంత్ చ‌తుర్వేది కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆపై ర‌ణ‌బీర్ క‌పూర్, వాణి క‌పూర్, సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ల్లో క‌ర‌ణ్ మ‌ల్హోత్రా రూపొందించిన భారీ చిత్రం షంషేరాను జూన్ 25న రిలీజ్ చేయ‌బోతున్నారు. ర‌ణ్వీర్ సింగ్, షాలిని పాండే (అర్జున్ రెడ్డి హీరోయిన్) జంట‌గా దివ్యాంగ్ ఠ‌క్క‌ర్ రూపొందించిన జ‌యేష్ బాయ్ జోర్దార్ చిత్రం ఆగ‌స్టు 27న విడుద‌ల కాబోతోంది. చివ‌ర‌గా య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఈ ఏడాది పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రం రానుంది. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేది ఈ భారీ చారిత్ర‌క చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం న‌వంబ‌రు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా య‌శ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప‌ఠాన్ సంగ‌తే తేలాల్సి ఉంది. అది ఈ ఏడాది విడుద‌ల‌వుతుందో లేదో చెప్ప‌లేం.

No comments:

Post a Comment