Showing posts with label Amaravathi Hot News. Show all posts
Showing posts with label Amaravathi Hot News. Show all posts

Tuesday, December 19, 2017

చంద్రబాబుపై ఇంతమందికి ఇంత ప్రేమా?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు ప్రపంచ మహాసభలు  మంగళవారం ముగియబోతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రాబోతున్నారు. అయితే సాటి తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం కార్యక్రమానికి ఆహ్వానం వెళ్లలేదు. తనను ఆహ్వానించకపోయినా పర్లేదని.. తెలుగు సభలు బాగా  జరిగితే చాలునని చంద్రబాబు తన సౌహార్దతను కూడా ప్రకటించేశారు.
అదే సమయంలో.. ప్రస్తుతం ఆయన సకుటుంబంగా విదేశీయాత్రలో గడుపుతున్నారు. అయితే చంద్రబాబును కనీసం ఆహ్వానించకుండా తెలుగు మహాసభలను ముగిస్తున్న వ్యవహారంపై  పలువురు ఇతర పార్టీల నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఇది తగని పని.. సాటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు.
చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందకుండా పోయిన విషయం చాలా రోజుల ముందునుంచి వివాదాస్పదంగానే మారుతోంది. ఈ వివాదానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మధ్యలో ఒకింత ప్రయత్నం చేసింది. చంద్రబాబును కూడా ఆహ్వానించబోతున్నాం అని.. కేవలం ఆయననే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే అందరు మంత్రులను కీలక రాజకీయ నాయకులను కూడా కార్యక్రమాలకు ఆహ్వానించబోతున్నాం అని వారు ప్రకటించారు. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రకటనలే అని తేలిపోయింది.
పేరుకు తెలుగు సభలుగా నిర్వహిస్తూ.. తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాల్లోని కీలక నేతల  కోటాలో.. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును తప్ప.. టీసర్కారు వేరెవ్వరినీ ఆహ్వానించలేదు. పైగా తెలుగు భాష అంటే ఎంతో అనురక్తి ఉన్న, భాషలో తనదైన శైలి, పటిమ ఉన్న, మొన్నటిదాకా గవర్నరు హోదాలోనే బాధ్యతలను నిర్వర్తించిన రోశయ్యను కూడా టీ సర్కారు ఆహ్వానించలేదు. చంద్రబాబును కూడా పిలవకుండా అవమానించారనే అభిప్రాయం.. సానుభూతి..  చంద్రబాబు వ్యతిరేకుల్లో కూడా వ్యక్తం అవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మామూలుగా అయితే చంద్రబాబు మీద ఇంతెత్తున విమర్శలు గుప్పిస్తూ ఉండే వీ హనుమంతరావు కూడా చంద్రబాబును పిలవకపోవడం తప్పే అని.. కేసీఆర్ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు ఏపీలో నిత్యం ప్రజాందోళనలతో చంద్రబాబు వైఫల్యాలను చాటిచెబుతూ ఉండే సీపీఐ నాయకుడు రామకృష్ణ కూడా.. అదే మాదిరిగా వాదిస్తున్నారు.
అయితే.. విపక్షాలకు చెందిన వారైనప్పటికీ.. వీరందరికీ చంద్రబాబు మీద ఇంత ప్రేమ ఉన్నదా అని ప్రజలు ఆశ్చర్యపోతుండడం విశేషం. వారు నిజంగానే సానుభూతి వ్యక్తం చేస్తున్నారా? లేదా, కేసీఆర్ తో విభేదాల దృష్ట్యా చంద్రబాబు రాలేని పరిస్థితిని హైలైట్ చేసి దెప్పిపొడవడానికి ఇండైరక్టుగా వెటకారం చేస్తున్నారా అనేది కూడా అర్థం కావడం లేదని ప్రజలు అనుకుటున్నారు.

Thursday, December 14, 2017

రాజమౌళి 'సినిమా' చూపించేశాడు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించి సినీ దర్శకుడు రాజమౌళి సూచనల్ని, సలహాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న విషయం విదితమే. ఇంతకీ, అమరావతి డిజైన్లపై మీ ముద్ర ఏంటి.? అన్న ప్రశ్నకు, 'ఏదో ఉడతా భక్తి సాయం..' అని రాజమౌళి అనేశాడు. తన సినిమాల్లో అద్భుతమైన సెట్స్‌తో, అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో అద్బుతాలు చేసే రాజమౌళి, అమరావతి కోసం సలహాలివ్వమంటే ఏ రేంజ్‌లో తన ప్రతిభను చాటుకుంటాడోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. 
ఇంతకీ, రాజమౌళి అమరావతి డిజైన్లకు దిద్దిన మెరుగులేమిటో తెలుసా.? ఓ చతురస్రాకార భవనం.. అందులో తెలుగుతల్లి విగ్రహం.. భవనం పై భాగంలో, సూర్య కాంతిని ఒడిసిపట్టే ఓ కటకం.. దాన్నుంచి వచ్చే రిఫ్లెక్షన్‌.. తెలుగుతల్లి విగ్రహంపైకి వెళ్ళడం.. అంతే, తెలుగు తల్లి విగ్రహం అద్భుత కాంతులతో బంగారు వర్ణంలో మెరిసిపోవడం.. ఇదీ కాన్సెప్ట్‌. 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికి రెండు సార్లు.. సూర్య కిరణాలు నేరుగా, సూర్య దేవాలయంలోని సూర్యనారాయణమూర్తి పాదాల్ని తాకుతాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తుంటారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఇంకెక్కడా లేని అద్భుతమిది. ఆ తరహాలోనే అమరావతి డిజైన్లకు తనదైన స్టయిల్లో రాజమౌళి మెరుగులు దిద్దాడు. 'ఇదీ నా కాన్సెప్ట్‌..' అంటూ సోషల్‌ మీడియాలో రాజమౌళి పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారిందిప్పుడు. ఈ తరహా గ్రాఫిక్స్‌ అద్భుతాల విషయంలో రాజమౌళికి తిరుగులేదంతే.!

రోజా ఆ 'బలహీనత'ను అధిగమించలేరా.?

ప్రత్యర్థిని తనదైన వాక్చాతుర్యంతో బిక్కమొహం వేసేలా చేయడం సినీ నటి, ఎమ్మెల్యే రోజా ప్రత్యేకత. ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ ఇంతే. ఆమె వాగ్ధాటి ముందు ఎంతటి రాజకీయ అనుభవం వున్నవారైనాసరే.. చేతులెత్తేయాల్సిందే. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేయడం అన్నట్టు కాకుండా, ప్రతి విషయాన్నీ కూలంకషంగా అధ్యయనం చేస్తారో ఏమో.. అందుకే, ఆమె రాజకీయ విమర్శలు చేసేటప్పుడు, ఆమె మాటలో స్పష్టత వుంటుంది. ఆమె వాదనలో 'వాస్తవం' కన్పిస్తుంటుంది. 
అయితే, అన్ని సందర్భాల్లోనూ రోజా వాగ్ధాటిని సమర్థించలేం. ఎందుకంటే, ఆమె చాలా తేలిగ్గా సంయమనం కోల్పోతుంటారు. అదే ఆమె బలహీనత. వాగ్ధాటి ప్రదర్శించే క్రమంలో రోజా, పొలిటికల్‌ సెటైర్లు వేస్తుంటారు. ఆ సెటైర్లు కొన్ని సందర్భాల్లో వర్కవుట్‌ అవుతుంటాయి.. ఇంకొన్నిసార్లు బెడిసి కొట్టేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ఇలాగే జరిగింది. అదే ఆమె, ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయ్యేలా చేసింది. 
అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్రల సంగతి పక్కన పెడితే, అప్పట్లో అసెంబ్లీలో రోజా మాట్లాడిన మాటల్ని ఎవరూ సమర్థించలేకపోయారు. ఆఖరికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా, పలు సందర్భాల్లో రోజా హద్దులు మీరి చేసే విపరీత వ్యాఖ్యలపై ఆమెను మందలించినట్లు ప్రచారం జరిగిన విషయం విదితమే. 
నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. రాజకీయ విమర్శలు మామూలే. కానీ, మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై రోజా చేసిన వ్యాఖ్యలు, వైఎస్సార్సీపీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. రాజకీయాల్లో మాట తూలడం వింతేమీ కాదు, అయితే దాన్ని వెనక్కి తీసుకోగలగాలి. ఇంకోసారి, 'తప్పుడు మాటలు' దొర్లకుండా జాగ్రత్తపడాలి. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, మహిళా ఎమ్మెల్యేగా రోజా, తన బలహీనతను గుర్తెరిగితే, ఆమె నాయకత్వ లక్షణాలు మరింతగా బయటపడ్తాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 
కానీ, రోజా తన మాటల్ని తాను అదుపులో పెట్టుకోలేరు. అదే ఆమె బలహీనత. అవతలవైపు నుంచి చిన్న స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా, రోజా నుంచి సరిద్దుకోలేని స్థాయిలో బూతులు దూసుకెళ్ళిపోతాయి. నిన్న ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో అదే జరిగింది. నిర్మాత బండ్ల గణేష్‌కీ రోజాకీ మధ్య జరిగిన మాటల యుద్ధం హద్దులు దాటేసింది. బండ్ల గణేష్‌ అంతే, ఆయన వ్యవహార శైలీ అంతే. కానీ, ఆయనేమీ ప్రజా ప్రతినిథి కాదు. అయినాసరే, ఆయనా తన మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. 
ఈ ఎపిసోడ్‌లో రోజా మరోసారి కార్నర్‌ అయ్యారు. ఆమె బూతుల ప్రవాహం అలాంటిది మరి. సభ్య సమాజం హర్షించే పదాజాలాన్ని ఆమె ఉపయోగించలేదు. ముందు ముందు మంచి రాజకీయ భవిష్యత్తు వున్నా, తన 'బలహీనత' కారణంగా అందరిలోనూ చులకనైపోతున్న రోజా తీరు అత్యంత బాధాకరం.
పార్టీ మారితే వాయిస్ మారుతుందని రోజాకీ తెలుసు.. ఆమె గతంలో రాజశేఖర్ రెడ్డిని తూలనాడారు.. ఇప్పుడు చంద్రబాబుని తూలనాడుతున్నారు.. ఈ లాజిక్ తెలుసుకున్న రోజా, తన బలహీనతను ఎందుకు గుర్తించలేకపోతున్నట్టు.?

Source: Greatandhra.com