Tuesday, April 12, 2016

రవిప్రకాశ్ ఎంత ఇబ్బంది పడిపోయారంటే..?

తెలుగు జర్నలిస్టులలో సెలబ్రిటీ హోదా ఉన్న జర్నలిస్టులు చాలా చాలా తక్కువ. అలాంటి స్టేటస్ ఉన్న వ్యక్తి టీవీ9 సీఈవో రవిప్రకాశ్. ఆయన స్క్రీన్ మీదకు వచ్చి ప్రశ్నలు వేస్తుంటే.. నేరుగా బుల్లెట్లు దించుతున్నట్లుగా ఉంటుంది. వేసే ప్రశ్న.. అందుకు ఎదుట వ్యక్తి చెప్పే సమాధానం.. దానికి తన చిరునవ్వుతో వేసే కౌంటర్లతో ఆయన చేసే ఇంటర్వ్యూలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి రవిప్రకాశ్ ను పవన్ కల్యాణ్ తనదైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారా? అంటే అవుననే చెప్పాలి. దాదాపు 40 నిమిషాలకు పైగా పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూను టీవీ9 టెలికాస్ట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని సంధించారు రవిప్రకాశ్. ఆయన లాంటి వ్యక్తి అడిగిన కొన్ని ప్రశ్నలు సగటు సినిమా అభిమానిని సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. పవన్ ఇంటర్వ్యూ అన్న వెంటనే ఆయన రెఢీ అయిపోయారని.. సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు ఆయన కసరత్తు చేయలేదన్న విషయం ఆయన సంధించే ప్రశ్నల్ని చూస్తే అర్థం కాక మానదు. దానికి తగ్గట్లే రవిప్రకాశ్ సైతం.. సినిమా ప్రశ్నలు అడగటం తనకు కాస్త కష్టమైన పని అంటూ.. అది తన సబ్జెక్ కాదంటూ ఒప్పేసుకోవటం ఆసక్తికరంగా అనిపించక మానదు. ‘‘రజనీకాంత్ షూస్ లో మీరు కాలు పెట్టారన్న’’ వాదన వినిపిస్తోందన్న రవిప్రకాశ్ ప్రశ్నకు పవన్ స్పందిస్తూ.. ‘‘ఎలా?’’ అని ప్రశ్న వేయటంతో రవిప్రకాశ్ వెంటనే రియాక్ట్ కాని వైనం కనిపిస్తుంది. తాను వేసిన ప్రశ్నను కాస్త కవర్ చేసుకుంటూ.. ‘‘మేనరిజమ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని..రజనీకాంత్ శైలిలో నటించటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని..’’ ఆయన వ్యాఖ్య చేయటం.. గడిచిన 20 ఏళ్లలో తన మార్క్ నటన తనకు ఉందంటూ పవన్ చెప్పటంతో.. అనవసరమైన ప్రశ్న అడిగానన్న భావన రవిప్రకాశ్ కు కలిగి ఉంటుంది. అందుకేనేమో.. తన మేనరిజమ్స్ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చిన తర్వాత రవిప్రకాశ్ రియాక్ట్ అవుతూ.. ‘‘సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడగటానికి అది నా సబ్జెక్ట్ కాదు. సినిమాల గురించి అడగటం నాకు కాస్త కష్టమైన విషయం’’ అని చెబుతూనే మరో ప్రశ్నలో కాస్త త్రోటుపాటుకు గురి కావటం కనిపిస్తుంది. ‘‘దాసరి దర్శకత్వంలో నటిస్తానని అన్నారు.. ఎప్పుడు చేస్తారు?’’ అన్న ప్రశ్న వేయటం.. దానికి పవన్ బదులిస్తూ.. ‘‘దర్శకత్వం కాదు.. ప్రొడ్యూస్ చేస్తానన్నారు’’ అంటూ సరిదిద్దటం కనిపిస్తుంది. ఏమైనా తన ప్రశ్నలతో ఇబ్బందికి గురి చేసే టీవీ9 రవిప్రకాశ్.. పవన్ విషయంలో మాత్రం ఆయనే ఇబ్బందికి గురి అయినట్లు కనిపించక మానదు.

No comments:

Post a Comment