Monday, May 16, 2016

శ్రీకాంత్ అడ్డాలకు కారు కూడా లేదట

తొలి సినిమా ‘కొత్త బంగారు లోకం’తోనే సూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్ అడ్డాల. రెండో సినిమాకే మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పనిచేశాడు. అది కూడా హిట్టే. మూడో సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో సినిమా చేశాడు. ఇలాంటి దర్శకుడికి ఇప్పటిదాకా ఒక కారు కూడా లేదంటే నమ్మశక్యంగా అనిపించదు. ఐతే స్వయంగా మహేష్ బాబే ఈ సంగతి చెబుతున్నాడు కాబట్టి నమ్మి తీరాల్సిందే. ఆల్రెడీ ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకలో శ్రీకాంత్ అడ్డాల గురించి మహేష్ గొప్పగా మాట్లాడాడు. శ్రీకాంత్ అడ్డాల స్వచ్ఛమైన మనిషి అని.. ఇండస్ట్రీ జనాలతో కలవకుండా తన పని తాను చేసుకుపోతుంటాడని అన్నాడు. మరోసారి ఈ దర్శకుడిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు మహేష్. ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ గురించి మహేష్ మాట్లాడుతూ.. ‘‘శ్రీకాంత్ లాంటి వాళ్లు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. అతను కారు కూడా మెయింటైన్ చేయడు. ఇండస్ట్రీలో ఎవరితోనూ స్నేహం చేయడు. తన పనేదో తాను చూసుకుంటుంటాడు. అతను చాలా స్వచ్ఛమైన మనిషిన. మంచి మనిషి. తన సినిమాల ద్వారా ఏదో ఒక మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుంటాడు. శ్రీకాంత్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం ఏడాది పాటు అతడితో ట్రావెల్ చేశాను. ఆ సినిమా చేసిన ఏడాదిలో నాలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. అవి నా నిజ జీవితానికి కూడా కనెక్టయ్యాయి. శ్రీకాంత్ కథలు సింపుల్‌గా ఉంటాయి. కానీ పవర్ ఫుల్‌గా ఉంటాయి. అందరూ కలిసుండాలి.. మంచి జరగాలి అని కోరుకునే శ్రీకాంత్ ఆ విషయాల్నే తన సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ‘సీతమ్మ వాకిట్లో..’లాగే బ్రహ్మోత్సవం కూడా ప్యూర్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ సినిమా ద్వారా కూడా నేను చాలా మారాను. చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నాడు.

No comments:

Post a Comment