Wednesday, August 9, 2017

నేనే తేజ.. నేనే డైరెక్టర్‌.!

తేజ సినిమాల్లో నటించాలంటే, తన్నులు తినాల్సిందే.! ఈ అభిప్రాయం చాలామందిలో వుంటుంది. తేజ అగ్రెసివ్‌గా వ్యవహరించడమే ఇందుకు కారణం. ఇదేదో దుష్ప్రచారం మాత్రమే కాదు. తేజ చేతిలో తన్నులు తిన్నవాళ్ళు చెప్పే మాట కూడా.! 'నేను ఏం చేసినా సినిమా కోసమే.. కొట్టడమంటే మరీ గట్టిగా కొట్టెయ్యం కదా.. ఏదో, అలా మందలిస్తాం..' అని సరదాగా నవ్వేశాడు చాన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో తేజ. 
అప్పట్లో తేజకి క్రేజ్‌ ఓ రేంజ్‌లో వుండేది. దాంతో, తేజతో తన్నులు తిన్నాం.. అని చెప్పుకోవడం గొప్ప విషయంగా ఫీలయ్యేవారు. అలా వాళ్ళు ఫీలవడానికి ఇంకో కారణం కూడా వుంది. అదేంటంటే, తేజ ఎక్కువగా కొత్తవాళ్ళను తెలుగు తెరకు పరిచయం చేసేవాడు. ఛాన్స్‌ దొరకడమే గొప్ప.. అనుకునేవాళ్ళు, తేజని దేవుడిగా ఆరాధించేవారు. సో, దేవుడి దండన పెద్ద విషయం కాదన్నది వారి భావన కావొచ్చుగాక.! 
ఇక, చాన్నాళ్ళుగా సరైన సక్సెస్‌ లేని తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఈ స్థాయిలో హైప్‌ వచ్చిందంటే దానిక్కారణం ఇందులో హీరోగా నటించిన రానా, హీరోయిన్‌గా నటించిన కాజల్‌. స్టార్‌ కాస్టింగ్‌ పరంగా సినిమాకి మంచి హైప్‌ వచ్చిందన్నది నిర్వివాదాంశం. 
ఆ సంగతి పక్కన పెడితే, తేజ ఇన్నాళ్ళూ దర్శకుడిగా ఫెయిలయ్యానో లేదో నాకు తెలియదుగానీ కథల పరంగా ఫెయిలయ్యాననీ, ఈసారి అలాంటి పొరపాటు జరిగే ఛాన్సే లేదంటున్నాడు. 'అహం' పేరుతో ఇంకో హీరోతో (రాజశేఖర్‌) అనుకున్న సినిమాని రానా కోసం 'నేనే రాజు నేనే మంత్రి'గా మార్చాడట తేజ. 'ఆ హీరోతో వర్కవుట్‌ అవదనే మానేశాం..' అని తేజ చెప్పడంలోనే, ఆయన ఇంతకు ముందెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వున్నాడనే విషయం అర్థమవుతోంది. 
అవును తేజ తీరే అంతా. 'నేనే తేజ, నేనే డైరెక్టర్‌' ఇదే తేజ కాన్ఫిడెన్స్‌. ఇది జస్ట్‌ కాన్ఫిడెన్స్‌ మాత్రమేనా.? ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదా.? ఏమో, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రిలీజైతే ఓ క్లారిటీ వస్తుంది.

No comments:

Post a Comment