Wednesday, August 9, 2017

ఉన్నది ఉన్నట్లుగా - నంద్యాల తెస్తున్న తంటా

2014 తరువాత మళ్లీ ఆ రేంజ్ ఎన్నికల పోరు సాగుతోంది నంద్యాల సాక్షిగా. ఇప్పటి దాకా ఎన్నికలు, ప్రజల్లో ఇమేజ్ నిరూపణ లాంటి వ్యవహారాలు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది అధికార టీడీపీ. ఎంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా, రాజీనామా లేఖలు, అలాగే వుంచేసి, సాంకేతిక అంశాల ప్రాతిపదికగా మొండిగా ముందుకు సాగిపోతోంది. ఎన్నికల ప్రమాదం అన్నది కిలోమీటర్ల దూరంలో కూడా లేకుండా జాగ్రత్త పడింది. కార్పొరేషన్ ఎన్నికలు జరపాల్సి వున్నా, ఏదో విధంగా నెట్టుకువస్తున్నారు, తప్ప, వాటి ఊసే ఎత్తకుండా కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో నంద్యాల ఉపఎన్నికలను ఫేస్ చేయకతప్పలేదు. నిజానికి ఇది అధికార పార్టీ చేతిలో లేని వ్యవహారం. వుండి వుంటే, ఏదో విధంగా దాన్ని కూడా వెనక్కు నెట్టేసే వారు. ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక కూడా 2015లోనో 2016లోనో వస్తే వేరేగా వుండేది. అలా కాకుండా 2017లో వచ్చింది. అంటే 2019 సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే వస్తాయి, అంటే 2018 చివరిలోనే అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక వచ్చింది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ? నంద్యాల ఎన్నికల ఎవరికి ప్రతిష్టాత్మకం అన్న ప్రశ్న వేసుకుంటే సహజంగానే ఇటు వైకాపా అటు తేదేపా అన్న సమాధానం వస్తుంది. కానీ మరి కాస్త లోతుగా తరచి చూసుకుంటే, అధికార తెలుగుదేశం పార్టీకి మరింతె కీలకం అన్న సమాధానం తడుతుంది. ముందుగా వైకాపా వ్యవహారం చూద్దాం. నంద్యాలలో గెలిస్తే, వైరి పక్షం ఏమని అంటుంది. అది గతంలో ఆ పార్టీ సీటే, అందుకే ఆ పార్టీనే గెల్చింది అని తేల్చేస్తుంది. అదే ఓడిపోతే, ప్రజలు తమ ప్రగతి చూసి పట్టం కట్టారు. ఇక వైకాపాను ఎక్కడైనా సరే ఇలాగే ఓడిస్తారు అంటూ హడావుడి చేస్తుంది. గెలిస్తే వైకాపాకు వచ్చేదేమిటి? నైతికబలం. మరో ఏడాదిలోనో ఏణ్ణర్థంలోనో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి తగినంత మనో బలం. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహం. అదే సమయంలో తేదేపా నుంచి వలసలు పెంచడానికి అవకాశం. మరి ఇదే కనుక తెలుగదేశం పార్టీ తరపు నుంచి చూస్తే. వేరుగా కనిపిస్తుంది పిక్చర్. అదేలా అంటే తెలుగుదేశం పార్టీ గెల్చిందనుకోండి. వైకాపా ఏమంటుంది? అధికార పార్టీ పాతిక మంది ఎమ్మెల్యేలను మోహరించింది. మంత్రులను పురమాయించింది. కోట్లు కుమ్మరించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది, అంటూ దాడికి దిగుతుంది. అదే కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనుకోండి. వైకాపా గేలిచే సంగతి అలా వుంచితే ఇంటర్నల్ గా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. తాను ఈ మూడేళ్లలో ఏదో చేసాం అని చెబుతున్న దాని మీద ఆ పార్టీ శ్రేణులకే అనుమానం వస్తుంది. అదే సమయంలో పార్టీలోని అసంతృప్తుల స్వరం మరి కాస్త గట్టిగా వినిపిస్తుంది. జంప్ జిలానీలు బ్యాగేజ్ లు సర్దుకుంటారు. భాజపాతో దోస్తీ అన్నింటికీ మించి భాజపాతో తెదేపా దోస్తీ ప్రమాదంలో పడుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా, తేదేపా ఈ రెండింటిలో ఎవరు గెలుపుగుర్రం అయితే అటే మొగ్గుతుంది భాజపా. దానికేమీ సెంటి మెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు అస్సలు లేవు. తేదేపా ప్రభ తగ్గుతోంది అని అనిపించగానే వైకాపా వేలు పట్టుకోవడానికి ఏమాత్రం సందేహించదు. అందుకు ఈ ఉపఎన్నికల ప్రాతిపదిక అవుతుంది. నిజానికి భాజపాతో దోస్తీ వదిలిపోతే ఇటు వామపక్షాలు, అటు జనసేన తన దగ్గరకు వచ్చి ఓ మహా కూటమి తయారవుతుందని తేదేపా భావిస్తోంది. కానీ మోడీ చరిష్మా ముందు ఇవన్నీ ఏ మేరకు నిల్చోగలవు అన్నది సందేహం. అయినా అదంతా 2018 చివరి నాటి వ్యవహారం. ఇప్పటికిప్పుడు తేదేపా ఓటమి పాలయితే, భాజపాకు ఇంకా వీక్ అయిపోతుంది. ఇప్పటికే పైకి కనిపించకున్నా చంద్రబాబుతో ఓ ఆటు ఆడుగుంటోంది భాజపా. అది కాస్త ముదురుతుంది. అంతే కాదు, చంద్రబాబుక మీడియా సహకారం కూడా కాస్త తగ్గే ప్రమాదం వుంది. తేదేపా ఓడిపోతే, వైకాపాకు వచ్చే బలం కన్నా, తమ పార్టీకి వచ్చే నష్టం ఎక్కువగా వుంటుందన్నది వాస్తవం. ఆ మీడియా గ్రహించిందా? చంద్రబాబు ఎంతమందిని పంపించినా, వాళ్లెవరు క్షేత్ర స్థాయిలో సరిగ్గా పని చేయడం లేదని, కేవలం పైపైనే వర్క్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీని నిర్మొహమాటంగా వెనకేసుకు వచ్చే మీడియా అప్పుడే కథనాలు వండి వారుస్తోంది. వాళ్లు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదని ఆ కథనాల సారాశం. అంటే ఓటమి భారాన్ని ఎన్నికల శ్రేణులుగా నిలిచిన వారిపై తోసేయడానికి ఇప్పటి నుంచే మార్గం సుగుమం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దూరమవుతున్న వర్గాలు పైగా దూరమవుతున్న వివిధ వర్గాలను దగ్గర చేసుకునే అవకాశాలు రాను రాను తగ్గుతున్నాయి. ఉద్యోగులను దాదాపు దూరం చేసుకున్నారు. దగ్గర చేసుకుందామని ప్రయత్నించినట్లు కనిపించారు మొన్నటికి మొన్న. కానీ వాస్తవానికి చేసింది ఏమిటి? డిఎ దాదాపు ఏణ్ణర్థం నుంచి బాకీ పెట్టి, రెండు నెలల తరువాత ఇవ్వడానికి ఇప్పుడు ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సిన మొత్తాలన్నీ పిఎఫ్ లోకి వెళ్లిపోయాయి. అదే సకాలంలో డిఎ ఇచ్చి వుంటే వారి ఆనందం వేరుగా వుండేది. అలాగే మరో డిఎ ఇంకా బకాయి వుండనే వుంది. భూమా చరిత్ర సమాప్తం ఈ ఎన్నికలో పరాజయం పాలయితే భూమా వర్గం పరిస్థితి మరీ ఘోరంగా వుంటుంది. ముందుగా వలస వెళ్లిన పార్టీలో విలువ పాతాళానికి పడిపోతుంది. ఇప్పటికిప్పుడు పదవి పోకపోయినా, విలువ అయితే శూన్యమవుతుంది. పైగా నియోజకవర్గంలో శిల్పా వర్గం పైచేయి సాధించేస్తుంది. వచ్చే ఎన్నికల సమయానికి ఇది అఖిలప్రియకు కూడా ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. చంద్రబాబుకు భూమా వర్గంపై మరీ ప్రేమ ఏమీ లేదు. వైకాపాను బలహీనం చేసుకోవడానికి తెచ్చుకున్నారంతే. ఇక అవసరం లేదనుకుంటే, టక్కున పక్కన పెట్టడంలో చంద్రబాబు నెంబర్ వన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన ఆల్టర్ నేటివ్ కోసం వెదుకుతారు. అది కూడా అఖిల ప్రియకు కాస్త కష్టమే. ఏం జరిగినా ఏమీ చేయలేరు నంద్యాల ఉపఎన్నికల ఫలితం వ్యతిరేకంగా వచ్చినా చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం పార్టీని ప్రక్షాళన చేస్తారనో, లేదా మార్పులు చేర్పులు వుంటాయనో అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే ఆశ్రితులు, కాని వారు అనే వర్గాలు ప్రతి చోటా క్లియర్ అయిపోయాయి. లోకేష్ కనుసన్నలలో వర్గాలు క్లియర్ గా ఏర్పడిపోయాయి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, తప్పు అయినా, ఒప్పు అయినా లోకేష్ తన వర్గాలతోనే వుంటారు తప్ప, అవసరం కోసం మిగిలిన వాళ్లను చేరేదీసే పరిస్థితి లేదు. క్షేత్ర స్థాయిలో అవినీతిపై ఉక్కుపాదం మోపే పరిస్థితి అంతకన్నా లేదు. బాబు చేసేది ఒక్కటే. మళ్లీ 2018 చివర్న వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా మరే విధమైన ఎన్నికలను ఫేస్ చేసే కష్టం రాకుండా చూసుకోవడం. ఇప్పటికే జిల్లా పరిషత్ ఎన్నికలను జరపడం లేదన్న సూచనలు ఇచ్చేసారు. ఇక మిగిలినవి పంచాయతీ, మున్సిపాల్టీ ఎన్నికలు. వాటినీ డిక్కీలో వుంచేస్తారు. రాబోయే ఎన్నికల కోసం గెలుపుగుర్రం ఎక్కడానికి ఏయే జవ సత్వాలు కావాలో అన్నీ చేసే ప్రయత్నంలో పడతారు. ఇప్పటికే మంత్రి అచ్చెం నాయుడు ప్రకటించారు చంద్రన్న కానుక కింద పంచె, చీర ఇస్తామని. పేరుకు చేనేత ఉద్దరణ. కానీ జరిగేది ప్రభుత్వ ఖర్చుతో జనాలకు చీరలు పంచెలు పంచడం. ఇదే పని పార్టీ చేస్తే ఎన్నికల నియమాల ఉల్లంఘన. అదే ప్రభుత్వం చేస్తే చేనేత ఉద్దరణ. డబ్బులు ఖర్చు లేకుండా పార్టీకి పబ్లిసిటీ. ఇలాంటి మరిన్ని వ్యవహారాలకు తెరలేస్తుంది. జనానికి తాయిలాలే తాయిలాలు. కానీ ఈ తాయిలాలతో ఓట్లు ఏ మేరకు రాలతాయి అన్నది మాత్రం ఇప్పట్లో తెలిసేది కాదు.

No comments:

Post a Comment