తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు ప్రపంచ మహాసభలు
మంగళవారం ముగియబోతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రాబోతున్నారు.
అయితే సాటి తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం కార్యక్రమానికి
ఆహ్వానం వెళ్లలేదు. తనను ఆహ్వానించకపోయినా పర్లేదని.. తెలుగు సభలు బాగా
జరిగితే చాలునని చంద్రబాబు తన సౌహార్దతను కూడా ప్రకటించేశారు.
అదే సమయంలో.. ప్రస్తుతం ఆయన సకుటుంబంగా విదేశీయాత్రలో గడుపుతున్నారు.
అయితే చంద్రబాబును కనీసం ఆహ్వానించకుండా తెలుగు మహాసభలను ముగిస్తున్న
వ్యవహారంపై పలువురు ఇతర పార్టీల నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఇది తగని
పని.. సాటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఉండాల్సిందని
పేర్కొంటున్నారు.
చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందకుండా పోయిన విషయం చాలా రోజుల ముందునుంచి
వివాదాస్పదంగానే మారుతోంది. ఈ వివాదానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి
తెలంగాణ ప్రభుత్వం మధ్యలో ఒకింత ప్రయత్నం చేసింది. చంద్రబాబును కూడా
ఆహ్వానించబోతున్నాం అని.. కేవలం ఆయననే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో తెలుగు
మాట్లాడే అందరు మంత్రులను కీలక రాజకీయ నాయకులను కూడా కార్యక్రమాలకు
ఆహ్వానించబోతున్నాం అని వారు ప్రకటించారు. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రకటనలే
అని తేలిపోయింది.
పేరుకు తెలుగు సభలుగా నిర్వహిస్తూ.. తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాల్లోని
కీలక నేతల కోటాలో.. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును తప్ప..
టీసర్కారు వేరెవ్వరినీ ఆహ్వానించలేదు. పైగా తెలుగు భాష అంటే ఎంతో అనురక్తి
ఉన్న, భాషలో తనదైన శైలి, పటిమ ఉన్న, మొన్నటిదాకా గవర్నరు హోదాలోనే
బాధ్యతలను నిర్వర్తించిన రోశయ్యను కూడా టీ సర్కారు ఆహ్వానించలేదు.
చంద్రబాబును కూడా పిలవకుండా అవమానించారనే అభిప్రాయం.. సానుభూతి..
చంద్రబాబు వ్యతిరేకుల్లో కూడా వ్యక్తం అవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మామూలుగా అయితే చంద్రబాబు మీద
ఇంతెత్తున విమర్శలు గుప్పిస్తూ ఉండే వీ హనుమంతరావు కూడా చంద్రబాబును
పిలవకపోవడం తప్పే అని.. కేసీఆర్ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు ఏపీలో
నిత్యం ప్రజాందోళనలతో చంద్రబాబు వైఫల్యాలను చాటిచెబుతూ ఉండే సీపీఐ నాయకుడు
రామకృష్ణ కూడా.. అదే మాదిరిగా వాదిస్తున్నారు.
అయితే.. విపక్షాలకు చెందిన వారైనప్పటికీ.. వీరందరికీ చంద్రబాబు మీద ఇంత
ప్రేమ ఉన్నదా అని ప్రజలు ఆశ్చర్యపోతుండడం విశేషం. వారు నిజంగానే సానుభూతి
వ్యక్తం చేస్తున్నారా? లేదా, కేసీఆర్ తో విభేదాల దృష్ట్యా చంద్రబాబు రాలేని
పరిస్థితిని హైలైట్ చేసి దెప్పిపొడవడానికి ఇండైరక్టుగా వెటకారం
చేస్తున్నారా అనేది కూడా అర్థం కావడం లేదని ప్రజలు అనుకుటున్నారు.
No comments:
Post a Comment