Thursday, December 14, 2017

రోజా ఆ 'బలహీనత'ను అధిగమించలేరా.?

ప్రత్యర్థిని తనదైన వాక్చాతుర్యంతో బిక్కమొహం వేసేలా చేయడం సినీ నటి, ఎమ్మెల్యే రోజా ప్రత్యేకత. ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ ఇంతే. ఆమె వాగ్ధాటి ముందు ఎంతటి రాజకీయ అనుభవం వున్నవారైనాసరే.. చేతులెత్తేయాల్సిందే. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేయడం అన్నట్టు కాకుండా, ప్రతి విషయాన్నీ కూలంకషంగా అధ్యయనం చేస్తారో ఏమో.. అందుకే, ఆమె రాజకీయ విమర్శలు చేసేటప్పుడు, ఆమె మాటలో స్పష్టత వుంటుంది. ఆమె వాదనలో 'వాస్తవం' కన్పిస్తుంటుంది. 
అయితే, అన్ని సందర్భాల్లోనూ రోజా వాగ్ధాటిని సమర్థించలేం. ఎందుకంటే, ఆమె చాలా తేలిగ్గా సంయమనం కోల్పోతుంటారు. అదే ఆమె బలహీనత. వాగ్ధాటి ప్రదర్శించే క్రమంలో రోజా, పొలిటికల్‌ సెటైర్లు వేస్తుంటారు. ఆ సెటైర్లు కొన్ని సందర్భాల్లో వర్కవుట్‌ అవుతుంటాయి.. ఇంకొన్నిసార్లు బెడిసి కొట్టేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ఇలాగే జరిగింది. అదే ఆమె, ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయ్యేలా చేసింది. 
అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్రల సంగతి పక్కన పెడితే, అప్పట్లో అసెంబ్లీలో రోజా మాట్లాడిన మాటల్ని ఎవరూ సమర్థించలేకపోయారు. ఆఖరికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా, పలు సందర్భాల్లో రోజా హద్దులు మీరి చేసే విపరీత వ్యాఖ్యలపై ఆమెను మందలించినట్లు ప్రచారం జరిగిన విషయం విదితమే. 
నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. రాజకీయ విమర్శలు మామూలే. కానీ, మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై రోజా చేసిన వ్యాఖ్యలు, వైఎస్సార్సీపీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. రాజకీయాల్లో మాట తూలడం వింతేమీ కాదు, అయితే దాన్ని వెనక్కి తీసుకోగలగాలి. ఇంకోసారి, 'తప్పుడు మాటలు' దొర్లకుండా జాగ్రత్తపడాలి. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, మహిళా ఎమ్మెల్యేగా రోజా, తన బలహీనతను గుర్తెరిగితే, ఆమె నాయకత్వ లక్షణాలు మరింతగా బయటపడ్తాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 
కానీ, రోజా తన మాటల్ని తాను అదుపులో పెట్టుకోలేరు. అదే ఆమె బలహీనత. అవతలవైపు నుంచి చిన్న స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా, రోజా నుంచి సరిద్దుకోలేని స్థాయిలో బూతులు దూసుకెళ్ళిపోతాయి. నిన్న ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో అదే జరిగింది. నిర్మాత బండ్ల గణేష్‌కీ రోజాకీ మధ్య జరిగిన మాటల యుద్ధం హద్దులు దాటేసింది. బండ్ల గణేష్‌ అంతే, ఆయన వ్యవహార శైలీ అంతే. కానీ, ఆయనేమీ ప్రజా ప్రతినిథి కాదు. అయినాసరే, ఆయనా తన మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. 
ఈ ఎపిసోడ్‌లో రోజా మరోసారి కార్నర్‌ అయ్యారు. ఆమె బూతుల ప్రవాహం అలాంటిది మరి. సభ్య సమాజం హర్షించే పదాజాలాన్ని ఆమె ఉపయోగించలేదు. ముందు ముందు మంచి రాజకీయ భవిష్యత్తు వున్నా, తన 'బలహీనత' కారణంగా అందరిలోనూ చులకనైపోతున్న రోజా తీరు అత్యంత బాధాకరం.
పార్టీ మారితే వాయిస్ మారుతుందని రోజాకీ తెలుసు.. ఆమె గతంలో రాజశేఖర్ రెడ్డిని తూలనాడారు.. ఇప్పుడు చంద్రబాబుని తూలనాడుతున్నారు.. ఈ లాజిక్ తెలుసుకున్న రోజా, తన బలహీనతను ఎందుకు గుర్తించలేకపోతున్నట్టు.?

Source: Greatandhra.com

No comments:

Post a Comment