Thursday, December 21, 2017

వ‌ల‌సెళ్లి పోతున్న ఇండియ‌న్లు

ఔను. భార‌తీయులు వ‌ల‌స వెళ్లి పోతున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాకు సాఫ్ట్‌వేర్ నిపుణులు, వైద్యులుగా, గ‌ల్ఫ్ వంటి దేశాలుక కార్మికులుగా, ఆఫ్రికా వంటి దేశాల్లో నైపుణ్య‌వంతులైన ఉన్న‌త శ్రేణి ఉద్యోగులుగా సేవ‌లు అందించేందుకు వ‌ల‌స వెళుతున్నారు. ఇలా వ‌ల‌స వెళ్లిన వారు తాజాగా ఓ రికార్డు సృష్టించారు. విదేశాలకు పెద్దసంఖ్యలో వలసపోయిన పౌరులున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌కు చెందిన కోటి 70 లక్షల మంది విదేశాల్లో నివసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ వలస నివేదికలో ఏ దేశం నుంచి ఎంతమంది వలస వెళ్లారన్న వివరాలను వెల్లడించింది.

మిగతా దేశాల కంటే భారత్ నుంచే అత్యధికంగా కోటి 70 లక్షల మంది వలసపోయారని, వారిలో ఒక్క గల్ఫ్ ప్రాంతంలోనే 50 లక్షల మంది భారతీయులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది, అమెరికా, సౌదీ అరేబియాలలో 20 లక్షల మంది చొప్పున భారతీయులు నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. భారత్ తరువాతి స్థానాల్లో మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్, సిరియా, పాకిస్థాన్ వంటి దేశాలు ఉన్నాయి. మెక్సికో నుంచి కోటి 30 లక్షల మంది, రష్యా నుంచి కోటి 10 లక్షల మంది, చైనా నుంచి కోటి మంది, బంగ్లాదేశ్, సిరియాల నుంచి 70 లక్షల మంది చొప్పున, పాకిస్థాన్, ఉక్రెయిన్‌ల నుంచి 60 లక్షల మంది చొప్పున వలసపోయారని ఐరాస తెలిపింది. స్వదేశాన్ని వదిలి ఇతర దేశాల్లో నివసిస్తున్న వివిధ దేశాల ప్రజల సంఖ్య మొత్తం 25.8 కోట్లు అని, 2000 సంవత్సరం నుంచి వలసల సంఖ్య 49 శాతం పెరిగిందని ఐరాస అంచనా వేసింది.

ఇదిలాఉండ‌గా...అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయులు త‌మ ముద్ర వేసుకున్నారని ఇటీవ‌లే ఓ నివేదిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అమెరికా పౌర‌స‌త్వం పొందినవారిలో భార‌తీయులు రెండో స్థానంలో నిలిచారు. అగ్ర‌రాజ్యం పొరుగున ఉన్న‌ మెక్సిక‌న్లు స‌హ‌జంగానే ప్ర‌థ‌మ‌స్థానంలో ఉన్నారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యురిటీ విడుద‌ల చేసిన నివేదిక ఈ అంశాన్ని వెల్ల‌డించారు. ఈ నివేదిక‌ ప్ర‌కారం 2016 ఆర్థిక సంవ‌త్స‌రం (అక్టోబ‌ర్ 1 2015 నుంచి సెప్టెంబ‌ర్ 30 2016వ‌ర‌కు) అమెరికా ప్ర‌భుత్వంచే దేశ పౌర‌స‌త్వం పొందిన 7.53 ల‌క్ష‌ల మందిలో భార‌తీయులు 6% ఉన్నారు.

No comments:

Post a Comment