Friday, June 21, 2019

ఒంటరి అయ్యేది పవనేనా?

రాజకీయ నిరాశ్రితులంతా భాజపా బాట పడుతున్నారు. కాపు సామాజిక వర్గ జనాలు కూడా అటే చూస్తున్నారు. వైకాపా తలుపులు తెరవకపోవడం, తెరవాలంటే బోలెడు రూల్స్ వుండడంతో జనాలు భాజపా వైపు వెళ్తున్నారు. అంతే తప్ప జనసేన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ కూడా ఫలితాలు వచ్చిన తరువాత ఒకటి రెండుసార్లు హడావుడి చేసి ఊరుకున్నారు తప్ప, పార్టీని అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఎవరికీ ఆ పార్టీ మీద ఆసక్తి కానీ దృష్టి కానీ లేకుండాపోయింది. చంద్రబాబు కూడా భాజపాతో కలిసి వెళ్లాలనే వ్యూహాన్ని ఇప్పటి నుంచీ అమలు చేసే పనిలో పడ్డారు.
ఈ నేఫథ్యంలో ఒంటరిగా మిగిలిపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ఒకవేళ తెలుగుదేశంతో వెళ్లాలనుకున్నా, ఆయన బలం ఎంతో ఇప్పుడే తెలిపోయింది కాబట్టి, అక్కడ లభించే గౌరవం అంతంత మాత్రంగానే వుంటుంది. ఈ నాలుగున్నరేళ్లలో పార్టీని ఏమైనా బిల్డప్ చేయగలిగితేనే పవన్ కు మాట, మర్యాద వుంటుంది. లేదూ అంటే ఎవ్వరూ పట్టించుకోరు.
2024 నాటికి జగన్ మాత్రమే వుంటారు. తను పోటీ పడవచ్చు అన్న పవన్ ఆశ నెరవేరడం కష్టం. చంద్రబాబు ఇప్పటి నుంచే తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు కాబట్టి, ఆ పార్టీ ఉనికి అలాగే వుంటుంది. అందువల్ల పవన్ మళ్లీ ముక్కోణపు పోటీకి రెడీ కావడమో? లేదా దేశం పంచన చేరడమో చేయాలి. ఈ రెండూ కూడా పవన్ కు కలిసి వచ్చే అంశాలు కాదు.
టోటల్ గా పవన్ కు 2024 కూడా కష్టకాలమే కానీ, ఆశ నెరవేరే కాలం కాకపోవచ్చు.

source : greatandhra.com

No comments:

Post a Comment