Friday, June 21, 2019

కామెడీ కదా.. సమంత కుమ్మేస్తుందిలే

సమంత ప్రధాన పాత్రలో గత ఏడాది ‘యు టర్న్’ అనే సినిమా వచ్చింది. కన్నడలో ఇదే పేరుతో సెన్సేషనల్ హిట్టయిన సినిమాకు అది రీమేక్. ఇక్కడా మంచి రివ్యూలు వచ్చాయి. చూసిన వాళ్లందరూ సినిమా బాగుందన్నారు. కానీ చివరికి చూస్తే సినిమా ఫ్లాప్ అయింది. సమంతకు కథానాయికగా ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయినా సినిమా ఆడకపోవడం ఆశ్చర్యమే.

ఎక్కడ తేడా కొట్టిందని ఆలోచిస్తే.. సమంత నుంచి జనాలు సీరియస్ సినిమాలు ఆశించరు. ఆమె నుంచి ఎక్కువగా కోరుకునేది ఎంటర్టైన్మెంట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ‘అఆ’లో సమంత కామెడీ చేస్తే ఎంత బాగా వర్కవుట్ అయిందో తెలిసిందే. ఆ చిత్రానికి సామ్ పాత్ర.. ఆమె పంచిన వినోదమే ప్రధాన ఆకర్షణ. ఈ విషయం గ్రహించే ఈసారి కామెడీతో సోలో హిట్ కొట్టాలని రెడీ అయింది సామ్.

సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్. ఐతే ఇదేదో మనకు సూటవ్వని సినిమా అనేమీ అనిపించట్లేదు ప్రోమోలు చూస్తే. ఇంతకుముందు టీజర్.. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన ట్రైలర్.. రెండూ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రధానంగా కామెడీ మీద నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఉన్నట్లుండి 70 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసుకు మారిపోయిన బామ్మ పాత్రలో సమంత తనదైన శైలిలో వినోదం పంచింది ట్రైలర్లో. ఆమె కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది.

చివర్లో కొన్ని షాట్స్ మినహాయిస్తే మిగతా అంతా ట్రైలర్లో కామెడీనే. పూర్తి వినోదాత్మకంగా సాగి.. చివర్లో కంటతడి పెట్టించే సినిమాలా కనిపిస్తోంది ‘ఓ బేబీ’. సురేష్ ప్రొడక్షన్ నిర్మాణంలో నందని రెడ్డి రూపొందించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సామ్ తొలి హిట్ కొడుతుందో లేదో చూద్దాం.

No comments:

Post a Comment