Friday, June 21, 2019

‘బిగ్ బాస్’కు సెన్సార్ అట

బ్రిటన్ నుంచి దిగుమతి అయి.. బాలీవుడ్లో హిట్టయి.. సౌత్‌ ఇండియాకు వచ్చిన టీవీ షో.. బిగ్ బాస్. ఐతే ఇంగ్లిష్, హిందీలతో పోలిస్తే సౌత్ బిగ్ బాస్ షోల్లో ‘బోల్డ్‌నెస్’ తక్కువే. ఇలాంటి షోల్లో ఎంత మసాలా ఉంటే అంత మజా. ఐతే తమిళ ‘బిగ్ బాస్’లో ఆ మాత్రం మజా కూడా లేకుండా రసం తీసేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ నెల 23 నుంచి తమిళంలో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రసారం కానుంది. ఐతే ఈ షోకు వ్యతిరేకంగా మద్రాస్ హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

ఈ షోలో పాల్గొంటున్న పార్టిసిపెంట్ల ప్రవర్తన.. వాళ్లు ధరించే బట్టలు.. మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలు అభ్యంతరకంగా ఉంటున్నాయని.. టీవీలలో వీక్షించే కుటుంబ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నాయని.. యువతను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని.. కాబట్టి ఈ షో ప్రతి ఎపిసోడ్‌ను ముందు సెన్సార్ బోర్డుకు చూపించాలని.. వాళ్లు సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారం చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
షో ప్రసారానికి ఇంకో నాలుగు రోజులే గడువు ఉండగా.. ఇలా పిటిషన్ పడటం.. విచారణ జరుగుతుండటంతో షో అనుకున్న సమయానికి మొదలవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. తొలి రెండు సీజన్ల మాదిరే ఈసారి కూడా కమల్ హాసనే తమిళ బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఒకవేళ పిటిషన్‌దారు అన్నట్లే సెన్సార్ చేశాకే ప్రతి ఎపిసోడ్ ప్రసారం చేయాలని కోర్టు కనుక తీర్పు ఇస్తే ‘బిగ్ బాస్’ మజాను కోల్పోతుందని దాన్ని అనుసరించే వీక్షకులు అంటున్నారు. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి.

No comments:

Post a Comment