Friday, June 21, 2019

రిలీజ్ డే.. మనోడు రచ్చ గెలుస్తాడా?

ఈ శుక్రవారం దేశం మొత్తాన్ని ఒక సినిమా ఆకర్షిస్తోంది. అదే.. కబీర్ సింగ్. రెండేళ్ల కిందట తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రేపిన సంచలనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకే ఒక్క సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి ఎక్కడికో వెళ్లిపోయాడు. హిందీ రీమేక్‌ను సైతం అతనే డైరెక్ట్ చేశాడు. ఇంట గెలిచిన సందీప్ రచ్చ కూడా గెలుస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘కబీర్ సింగ్’కు క్రేజ్ అయితే బాగానే వచ్చింది. దీని ప్రోమోలు ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల దీని కథపై జనాలకు అవగాహన లేకుండా ఏమీ లేదు. క్యూరియాసిటీతో చాలామంది ‘అర్జున్ రెడ్డి’ని ప్రైమ్‌లో చూసే ఉంటారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ‘అర్జున్ రెడ్డి’ చూసిన వాళ్లు కూడా ‘కబీర్ సింగ్’ మీద ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దక్షిణాదిన కూడా ఈ సినిమాకు హైప్ కనిపిస్తోంది.

ఓవైపు తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ మొదలుపెట్టి ఒకటికి రెండు వెర్షన్లు తీశారు. కానీ అవి జనాలకు రుచించలేదు. కానీ షాహిద్ హీరోగా సందీప్ తీసిన ‘కబీర్ సింగ్’ మాత్రం ముందు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. షాహిద్ లాంటి అనుభవజ్ఞుడు, మంచి పెర్ఫామర్‌ను హీరోగా పెట్టుకుని సందీప్ మంచి పని చేశాడు. అతడికి కియారా అద్వానీ రూపంలో మంచి జోడీ కూడా దొరికింది. ఒరిజినల్‌లోని ఇంటెన్సిటీ, సోల్ మిస్ కాకుండా చూడటంలో సందీప్ విజయవంతం అయినట్లున్నాడు.

శుక్రవారం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్న ఈ చిత్రం.. ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది, ప్రేక్షకుల్ని ఏ మేర థియేటర్లకు రప్పిస్తుంది.. ఎంత వరకు వసూళ్లు రాబడుతుంది అన్నది ఆసక్తికరం. తెలుగులో మాదిరే ఈ చిత్రం అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ అయితే.. సందీప్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం ఖాయం.

No comments:

Post a Comment