Friday, July 12, 2019

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ కు బెయిల్ !

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు పెద్ద ఊరట లభించింది. అలంద మీడియా ఫిర్యాదు మేరకు ఆయన మీద నమోదైన మూడు కేసుల్లో తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇటీవలే ఆయన బెయిలు పిటిషను పై వాదనలు జరిగాయి. అతను ఆర్థిక నేరగాడు అని, సాక్షులను ప్రభావితం చేస్తారని అలంద మీడియా తరఫు న్యాయవాదులు వాదించినా... రవి ప్రకాష్ తరఫు న్యాయవాదుల వాదనతో కొన్ని విషయాల్లో ఏకీభవించిన కోర్టు రవిప్రకాష్ కు మూడు కేసుల్లో బెయిలు మంజూరు చేసింది. అయితే, కొన్ని షరతులు విధించింది.

బెయిల్ పొందినా... ఇక నుంచి ఇతర దేశానికి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాలి. అలాగే ఇక ముందు కూడా పోలీసులకు విచారణలో సహకరించాలి. అంతేగాకుండా పోలీసుల వద్ద ప్రతి వారమూ హాజరు వెయ్యాలి అని కోర్టు షరతులు పెట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుపై చాలా ఆసక్తి వ్యక్తమైంది. కేసు పెట్టిన అలంద మీడియా ప్రభుత్వంలోని కేసీఆర్ సన్నిహితులది కావడం దీనికి కారణం. పైగా టేకోవర్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల ఈ కేసు పాపులర్ అయ్యింది.

ఇదిలా ఉండగా... మూడు సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా, సుప్రీం కోర్టు వరకు వెళ్లినా విచారణకు ముందే రవిప్రకాష్ కు బెయిల్ దక్కలేదు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పోలీసుల వద్ద విచారణకు హాజరైన రవి ప్రకాష్ దర్యాప్తునకు సహకరించారు. అనంతరం మరోసారి హైకోర్టును ఆశ్రయించగా... రవి ప్రకాష్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తాజాగా ఈరోజు రవిప్రకాష్ కు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో బెయిలు దక్కినా... ఈ రాజకీయ క్రీడలో రవిప్రకాష్ గెలిచినట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment