Monday, July 22, 2019

బిగ్ బాస్ నాగ్ భలే మేనేజ్ చేశాడులే.

బిగ్ బాస్’ షోకు సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ చాలా కీలకం. దాన్ని బట్టే హోస్ట్‌లు షోను నడిపించడం చూస్తుంటాం. తెలుగులో తొలి సీజన్లో జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్లో నాని సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, ఫీడ్ బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని.. దాన్ని సందర్భానుసారం ఉపయోగించేవారు. డిస్కషన్లు పెట్టేవాళ్లు. అక్కడి మీమ్స్ గురించి కూడా లోపల చర్చ జరిగేది.

ఈసారి ‘బిగ్ బాస్’ షో మొదలు కాకముందే సోషల్ మీడియా టాక్ మీద అధ్యయనం జరిపినట్లున్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యే జనాలనే పార్టిసిపెంట్లుగా తీసుకున్నారు. మరోవైపు ఈ షో హోస్ట్‌గా తాను ఖరారయ్యాక జరిగిన చర్చ, లేవనెత్తిన అభ్యంతరాల్ని నాగార్జున బాగానే పట్టించుకున్నాడు.

గత ఏడాది ‘దేవదాస్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ‘బిగ్ బాస్’ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు నాగ్. ఈ షో గాసిప్ లాంటిదన్న నాగ్... ఈ షో చూసేవాళ్ల మనస్తత్వాన్ని విమర్శిస్తూ  ‘వాయిరిస్టిక్’ అనే ఒక తీవ్ర పదాన్ని కూడా వాడాడు. అంత మాట అన్నాక మళ్లీ షోను హోస్ట్ చేస్తే ఎలా? ఇదే విషయంలో నాగ్ తీరును జనాలు ఎండగట్టారు.

మరి ఈ విషయాన్ని మరిపించి షోను హోస్ట్ చేసినా కష్టమే. అందుకే తనకు షో పట్ల ఉన్న వ్యతిరేకత గురించి నిన్న సీజన్-3 ఆరంభ వేడుకల్లోనే నాగ్ మాట్లాడేశాడు. నేరుగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాకే ముందుకు వెళ్లాడు.

తనకు బేసిగ్గా ‘బిగ్ బాస్’ షో అంటే ఆసక్తి లేదని.. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికీ ఈ షో ఎలా వెళ్లిందో.. ఇంతమందికి ఎలా చేరువయ్యిందో తెలుసుకోవాలన్న ఆసక్తితోనే తాను హోస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని చెప్పాడు నాగ్. ఈ మాట అనడం ద్వారా ఇక విమర్శలకు అవకాశం లేకుండా చేసుకున్నాడు. నాగ్ ఎంత తెలివైన వాడు అనడానికి ఈ వ్యాఖ్యే నిదర్శనం.

No comments:

Post a Comment