Friday, July 12, 2019

దేవరకొండకు భలే ఐడియాలొస్తాయే..

తన సినిమాల్ని, తన బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో విజయ్ దేవరకొండ రూటే వేరు. ఇప్పటిదాకా ఏ హీరోకు, ఏ ఫిలిం మేకర్‌కు రాని ఐడియాలు అతడికి వస్తుంటాయి. అతడి మాటలతో పాటు చేష్టలు కూడా సినిమా ప్రమోషన్‌కు భలేగా ఉపయోగపడుతుంటాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాల్ని అతను ప్రమోట్ చేసిన తీరు వాటికి చాలా బాగా ఉపయోగపడింది. ‘ట్యాక్సీవాలా’ సినిమా చూసేందుకు థియేటరుకు వెళ్లి ప్రేక్షకులందరికీ క్యాంటీన్‌లో ఉచితంగా స్నాక్స్ ఇప్పించడం అతడికే చెల్లింది. అలాగే తనమీద జరిగిన ట్రోలింగ్‌ను ‘గీత గోవిందం’ ప్రమోషన్ కోసం ఎలా ఉపయోగించాడో తెలిసిందే.

ఇప్పుడు తన కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ కోసం కూడా ఒక కొత్త ప్రమోషనల్ ప్లాన్ వేశాడు విజయ్. ఈ సినిమా దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రతి రాష్ట్రానికీ వెళ్లి మామూలుగా ప్రెస్ మీటో లేదంటే ప్రి రిలీజ్ ఈవెంటో పెడితే రొటీన్‌గా ఉంటుందని ‘డియర్ కామ్రేడ్’ టీం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో ఈవెంట్లు చేయబోతున్నారు. బెంగళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్, వైజాగ్ సిటీల్లో ఓపెన్ లొకేషన్ సినిమాలోని పాటలు ప్లే చేస్తూ డ్యాన్సులు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయడం, సినిమాను ప్రమోట్ చేయడం ఈ ఫెస్టివల్ ఉద్దేశం. లొకేషన్ చూసుకుని వచ్చేయండి, కుమ్మేద్దాం అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు విజయ్. బెంగళూరులో జరిగే ఈవెంట్‌కు ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ కూడా రాబోతున్నట్లు అతను వెల్లడించాడు. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ఐడియా విజయ్‌దే అని చిత్ర వర్గాల సమాచారం.

No comments:

Post a Comment