Monday, July 15, 2019

సుకుమార్ సినిమా ఇంకెప్పుడు మొదలవ్వాలి?

సుకుమార్ చివరి సినిమా ‘రంగస్థలం’ విడుదలై 15 నెలలు దాటింది. సుక్కు అందరిలా వేగంగా సినిమాలు తీసే దర్శకుడు కాదు కానీ.. మరీ ఒక సినిమాకు ఇంకో సినిమాకు మధ్య ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటే మాత్రం సరైన ప్లానింగ్ లేనట్లే. ముందు అనుకున్న ప్రకారం అయితే ఆయన ఈపాటికి మహేష్ బాబుతో తన కొత్త సినిమాను దాదాపుగా పూర్తి చేయాల్సింది.

కానీ అనూహ్యంగా ఈ చిత్రం నుంచి మహేష్ తప్పుకోవడం.. బన్నీ ఆ స్థానంలోకి రావడం.. స్క్రిప్టులో మార్పులు జరగడం.. షూటింగ్ షెడ్యూళ్ల ప్లానింగ్ మారండం.. ఇలా మధ్యలో ఎన్నెన్నో పరిణామాలు జరిగాయి. ఐతే అయిందేదో అయింది.. ఇంకో నెలా రెండు నెలల్లో బన్నీ-సుక్కు సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమాను ఆగస్టుకల్లా పూర్తి చేసి సుక్కు సినిమాలోకి వచ్చేస్తానని కూడా బన్నీ ఇంతకుముందు హామీ ఇచ్చాడు.

కానీ సుకుమార్ స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యం చేస్తున్నాడో.. బన్నీకి త్రివిక్రమ్ సినిమా నుంచి బయటికి రావడానికి లేటవుతుందో తెలియదు కానీ.. పరిస్థితులు చూస్తే ఈ ఏడాది చివరికి కానీ వీళ్ల సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి కాగానే సుక్కు సినిమాకు కాల్ షీట్లు ఇచ్చిన ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. ఇప్పుడు ప్రణాళిక మార్చుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’కు కమిటయ్యాడు.

ఈ చిత్రం అక్టోబరు-నవంబరు మధ్య కానీ పూర్తయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత కానీ రత్నవేలు అందుబాటులోకి రాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ మాదిరే బన్నీ-త్రివిక్రమ్ సినిమా సైతం సంక్రాంతినే టార్గెట్ చేసుకుంది. దీని షూటింగ్ పూర్తవడానికి కూడా ఈ ఏడాది చివరి దాకా పట్టొచ్చు. కాబట్టి కొత్త ఏడాదిలో ఫ్రెష్‌గా తన కొత్త సినిమాను పట్టాలెక్కిస్తాడేమో సుకుమార్. అంటే ‘రంగస్థలం’ తర్వాత దాదాపు రెండేళ్లు షూటింగ్ లేకుండా ఉంటున్నాడన్నమాట సుక్కు.

No comments:

Post a Comment