Friday, July 19, 2019

‘రాక్షసుడు’ టీం భలే మేనేజ్ చేస్తోందిగా.

‘రాక్షసుడు’ సినిమాతో కోనేరు సత్యనారాయణ రూపంలో తనకు మరో మంచి నిర్మాత దొరికాడని అంటాడు బెల్లంకొండ శ్రీనివాస్. పెద్ద దర్శకులు ‘రాక్షసుడు’ సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందుకొచ్చినా నిర్మాత తనకే అవకాశం ఇవ్వడం అదృష్టం అంటాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ కథకు బెల్లంకొండ శ్రీనివాస్ అయితేనే న్యాయం చేస్తాడనిపించిందని అంటాడు నిర్మాత.

‘రాక్షసుడు’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలా ఎవరికి వాళ్లు తమ పాత్రల్ని చక్కగా పోషించారు. కానీ కెరీర్లో ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేని బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా.. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇచ్చిన రమేష్ వర్మను దర్శకుడిగా ఏరి కోరి ఎంచుకుని కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించడానికి అసలు కారణమేంటి?

తన కొడుకు హవీష్‌ను హీరోగా నిలబెట్టాలని కోనేరు సత్యనారాయణ ఆశ. కానీ అతనేమో నటుడిగా కనీస మార్కులు కూడా సంపాదించుకోలేదు. సినిమా సినిమాకూ కిందికి పడిపోతున్నాడు. అలాంటి హీరోతో సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఇలాంటి సమయంలో రమేష్ వర్మ ముందుకొచ్చి తనే స్క్రిప్టు సమకూర్చి ‘7’ అనే సినిమా తీసి పెట్టాడు. ఈ సినిమాకు నిర్మాతగా రమేష్ పేరు పడింది కానీ.. డబ్బులు పెట్టింది హవీష్ తండ్రే. ఈ సినిమా తీసినందుకు ప్రతిఫలంగా రమేష్ వర్మకు ‘రాక్షసుడు’ దక్కింది. ఈ సినిమాకు పూర్తి పెట్టుబడి సత్యనారాయణది కాదని సమాచారం.

కొంత మేర బెల్లంకొండ సురేష్ భరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఈ సినిమాకు పారితోషకం కూడా తీసుకోలేదని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సురేష్ సినిమాలు తీయడు. కానీ తెర వెనుక ఉండి అన్నీ నడిపిస్తాడు. కొంత పెట్టుబడి భరిస్తాడు. శ్రీనివాస్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన పని ఉండదు. ఫైనాన్షియర్లతో ఇబ్బందుల వల్ల సొంతంగా సినిమా తీసే అవకాశం లేక ఆయన చేసుకున్న ఏర్పాటిది. ‘రాక్షసుడు’ వెనుక ఇన్ని మతలబులుంటే పైకి చేస్తున్న షో మాత్రం వేరుగా ఉంది.

No comments:

Post a Comment