Wednesday, July 24, 2019

వర్మ ట్రై చేస్తున్నాడట.. అభిమానుల ఆందోళన

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడానికి హీరోలు క్యూలో ఉండేవాళ్లు. పెద్ద పెద్ద స్టార్లకు సైతం ఆయనతో ఒక్కసారైనా పని చేయడం కలగా ఉండేది. కానీ ఇప్పుడు వర్మతో సినిమా అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. చిన్న స్థాయి హీరోలు కూడా ఆయనకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో అయినా వర్మతో సినిమా పట్ల ఆసక్తి కనబరిస్తే అభిమానులే ఊరుకోవట్లేదు.

ముఖ్యంగా ‘ఆఫీసర్’తో నాగార్జునకు ఘోరమైన పరాభవం ఎదురయ్యాక ఏ హీరో అభిమాని కూడా వర్మతో సినిమాకు అంగీకరించట్లేదు. ఇప్పుడు రామ్ అభిమానుల పరిస్థితి కూడా అంతే. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ వసూళ్లతో సాగిపోతున్న సంగతి తెలిసిందే.

సక్సెస్ సెలబ్రేషన్లలో చిత్ర బృందానికి మించి వర్మనే ఎక్కువ హడావుడి చేస్తున్నాడు. హీరో రామ్ యూరప్ పర్యటనలో ఉంటే ఇక్కడ వర్మ విజయానందం పట్టలేకుండా ఉంది. ఐతే ఈ హడావుడికి వేరే కారణం కూడా ఉందని.. రామ్‌తో ఒక సినిమా చేద్దామని వర్మ ప్రయత్నిస్తున్నాడని.. తన శిష్యుడి కంటే బాగా రామ్‌ను ప్రెజెంట్ చేస్తానని అంటున్నాడట వర్మ. ఈ మాట తమాషాకు అన్నాడో నిజంగా అన్నాడో కానీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి రామ్ అభిమానులు బెంబేలెత్తుతున్నారు.

నిజానికి రామ్ పూరితో సినిమా చేయడాన్నే అతడి అభిమానులు వ్యతిరేకించారు. పూరి ట్రాక్ రికార్డు చూసి భయపడ్డారు. అయినా రామ్ తెగించి సినిమా చేశాడు. కాలం కలిసొచ్చి సినిమా పెద్ద హిట్టయింది. ఈ ఉత్సాహంలో వర్మ జోలికి మాత్రం వెళ్లొద్దని.. పొరబాటున వర్మతో సినిమా చేస్తే జీవితకాలం రిగ్రెట్ కావాల్సి ఉంటుందని అతడి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment