Thursday, July 4, 2019

పూరి సైలెంటుగా లేపేశాడా?

పూరి జగన్నాథ్-రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ బుధవారమే రిలీజైంది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది.  కొందరేమో మాస్ ప్రేక్షకులకు సినిమా కనువిందే అంటుంటే.. ఇంకొందరేమో ట్రైలర్ మరీ లౌడ్‌గా ఉందని, తెలంగాణ నేపథ్యం, భాష, యాస కృత్రిమంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తం చేశారు.

ట్రైలర్ వరకు చూస్తే కొత్తగా అనిపించిన పాయింట్.. హీరో తలలో పోలీసులు ఒక చిప్ పెట్టడమే. దీని చుట్టూ ఏదో ట్విస్టు ఉంటుందని, ఆ పాయింట్ బాగుంటే సినిమా ఆడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఐతే ట్రైలర్లో కొత్తగా అనిపించిన ఈ పాయింట్ పూరి సొంత ఆలోచన కాదని నెటిజన్లు పట్టేశారు.

ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రపంచంలో ఎక్కడి సినిమాను కాపీ కొట్టినా నెటిజన్లు పట్టేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ కథ కాపీ అనే విషయాన్ని కూడా ఇలాగే పట్టేశారు. మూడేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ మూవీ ‘క్రిమినల్’ నుంచే ‘ఇస్మార్ట్ శంకర్’ ప్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రిమినల్’ ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. హీరో తలలో పోలీసులు చిప్ పెట్టడం.. దాని చుట్టూ సన్నివేశాలు ఆ ట్రైలర్లో ఉన్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్లోనూ సేమ్ షాట్లు దర్శనమివ్వడంతో కథాంశాన్ని పూరి అక్కడి నుంచే లేపేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగినట్లయితే అనిపించడం లేదు. ఐతే బేసిక్ ప్లాట్ తీసుకుని పూరి తన మార్కు ట్రీట్మెంట్‌తో సినిమాను నడిపించినట్లు అనిపిస్తోంది.

No comments:

Post a Comment