Tuesday, July 9, 2019

ఎక్కువ క‌రెంటు బిల్లు క‌ట్టారా..ఐటీ నోటీసులు రావ‌చ్చు

బ‌డ్జెట్ షాకుల ప‌రంప‌ర‌లో మ‌రొక‌టి తోడ‌యింది. సెక్షన్‌ 139 ఆదాయ పన్ను చట్టం ప్రకారం అధిక స్థాయిలో లావాదేవీలు జరిపేవారిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారిలో విదేశీ ప్రయాణాలు చేస్తున్నవారు, అధిక కరెంట్‌ బిల్లులు చెల్లిస్తున్నవారు కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కేంద్రం నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌న్ను ప‌రిధిని మ‌రింత విస్తృతం చేయ‌డంలో భాగంగా కేంద్రం నూత‌న నిబంధ‌న‌లు రూపొందించింది. ఏడాదికి విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలు దాటి ఖర్చు చేసిన వారు, బ్యాంకుల్లో కోటి రూపాయల కంటే అధికంగా డిపాజిట్‌ చేసిన వారు, లక్ష రూపాయల కంటే అధికంగా కరెంట్‌ బిల్లు చెల్లిస్తున్నవారు రిటర్నులు తప్పనిసరని తాజాగా స్పష్టంచేసింది. తాజా నిబంధ‌న‌ల‌తో ఐటీ అంటే భారీగా సంపాదించే వారు మాత్ర‌మే కాదు....ఓ మోస్తారు బిల్లుక‌ట్టే వారు కూడా అన్న‌మాట‌. సో మ‌న గుండె గుబిల్లు మ‌న‌కుండా కరెంటు బిల్లును విష‌యంలో కూడా జాగ్ర‌త్త ప‌డాల్సిందే. కాగా, కేంద్ర బ‌డ్జెట్‌లో సంపన్న వర్గాలపై అధిక పన్నుతోపాటు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పన్నులను పెంచడం ద్వారా, ముఖ్యంగా ఇంధనాలపై విధించిన సెస్‌ ద్వారా అధికంగా నిధులు సమకూరనున్నాయని, పసిడి దిగుమతులపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచడం, రూ.2 కోట్ల కంటే అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్‌ రూపంలో విధించిన పన్ను ఇందుకు దోహదం చేశాయ‌ని కేంద్రం భావిస్తోంది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల కంటే అధిక ఆదాయం కలిగినవారిపై 15 శాతానికి బదులుగా 37 శాతానికి సవరించింది. పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంతో అదనంగా రూ.3,000-4,000 కోట్ల నిధుల సమకూరవచ్చునని అంచనా.

No comments:

Post a Comment