Tuesday, July 23, 2019

బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినా విజయ్‌ దేవరకొండ పట్టించుకోట్లేదు

విజయ్‌ దేవరకొండకి వున్న ఇమేజ్‌కి ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్‌తో చేస్తే అంతగా మార్కెట్‌ పెరుగుతుంది. అయినా కానీ కొత్త దర్శకులు, ఫెయిల్‌ అయిన దర్శకులతోనే అతను సినిమాలు చేస్తున్నాడు. ఇలాగైతే ఫ్రెష్‌ ఐడియాలు వస్తాయని, అన్నీ తన కంట్రోల్‌లో వుంటాయనేది అతని అభిప్రాయం కావచ్చు. కానీ తనని ఎంత పెద్ద దర్శకుడు సంప్రదించినా కానీ బిజీగా వున్నానంటూ మాట దాటవేస్తున్నాడు.

విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలని పూరి జగన్నాధ్‌ చూస్తున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌కి ముందు అతని డేట్స్‌ కోసం ప్రయత్నించాడు కూడా. కానీ విజయ్‌ అంత తేలికగా ఏ సినిమా ఒప్పుకోడు. ఇస్మార్ట్‌ శంకర్‌ బ్లాక్‌బస్టర్‌ అయింది కనుక పూరీతో ఇప్పుడు దేవరకొండ ఇమ్మీడియట్‌గా చేస్తాడని ఒక వర్గం మీడియా రిపోర్ట్‌ చేస్తోంది. ఇద్దరూ మాట్లాడేసుకున్నారని, ఈ సినిమా ఖాయమని కూడా కొందరు కుండ బద్దలు కొట్టేయడం కనిపించింది.

కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం అదేమీ పట్టనట్టే వున్నాడు. అతనితో ఇప్పట్లో సినిమా ఏమీ లేదని చూచాయగా చెప్పేసాడు. తన మలి చిత్రాల జాబితా చెబుతూ ఎక్కడా పూరి పేరు చెప్పలేదు. తనతో పూరీ సినిమా వుందని వస్తోన్న వార్తలు విజయ్‌కి తెలుసు. అయినా కానీ దానిపై స్పందించకుండా మళ్లీ పూరీని వెయిటింగ్‌లోనే పెట్టాడు.

No comments:

Post a Comment