Tuesday, July 2, 2019

‘శివ’ ప్రివ్యూ చూసి ఆమె షాకైన వేళ..

తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఒక గొప్ప మలుపు. మన సినిమా నడతనే మార్చిన చిత్రమది. అప్పటిదాకా ఒక మూసలో సాగిపోతున్న తెలుగు సినిమా.. ‘శివ’ తర్వాత ఒక కొత్త దారిలో నడిచింది. ఇండియాలో మిగతా ఫిలిం ఇండస్ట్రీలన్నీ కూడా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన చిత్రమది. అప్పట్లో ఎంతోమంది ఈ సినిమా చూసి విస్మయానికి గురయ్యారు.

ఐతే ఈ చిత్రాన్ని విడుదల కంటే ముందు చూసి తాను ఎలా షాకయ్యానో సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి తాజాగా ఒక సినీ వేడుకలో గుర్తు చేసుకున్నారు. నటిగా కంటే రోహిణి డబ్బింగ్ ఆర్టిస్టుగానే ఎక్కువ పాపులర్. ‘శివ’ కంటే ముందు ‘గీతాంజలి’ సినిమాలో కథానాయిక పాత్రకు రోహిణి చెప్పిన డబ్బింగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. హీరోయిన్ పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోసింది రోహిణి. ‘శివ’లో అమల పాత్రకూ ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని నాగ్, వర్మ అనుకున్నారట.

ఐతే రోహిణిని అడిగితే తాను డబ్బిగ్ చెప్పనని అన్నారట. తాను డబ్బింగ్ చెప్పడమే మానేశానని చెప్పారట. కానీ నాగ్, వర్మ ఒప్పుకోలేదట. డబ్బింగ్ చెప్పి తీరాల్సిందే అని పట్టుబట్టారట. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఏంటి అనే అహం తనలో ఉందని.. ఆ అహంతోనే ముందు సినిమా చూపించండి, తర్వాత ఆలోచిస్తా అన్నానని.. సరే అని తనకు ప్రత్యేకంగా ప్రివ్యూ వేశారని రోహిణి చెప్పింది.

ఐతే ‘శివ’ చూస్తూ తాను షాకైపోయానని.. మూడో రీల్ దగ్గరికి వచ్చేసరికే తాను ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం వదులుకోకూడదని ఫిక్సయ్యానని రోహిణి వెల్లడించింది. ఆ సినిమా తర్వాత కొత్త దర్శకుల మీద గౌరవం పెరగడంతో పాటు.. ఒక రకమైన భయం కూడా వచ్చేసిందని రోహిణి తెలిపింది.

No comments:

Post a Comment