Friday, July 12, 2019

అమిత్‌షాతో డీఎస్‌...లెక్క‌లు మారుతున్నాయి కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితికి మ‌రో ఊహించ‌ని షాక్ ఇది. ఆ పార్టీకి చెందిన ఎంపీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సంచ‌ల‌నం సృష్టించింది తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ (డీఎస్‌). ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన  మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ‌లో మారుతున్న స‌మీక‌ర‌ణాల‌కు ఈ భేటీ నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన డీఎస్.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదన్న కారణంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.  అదే స‌మ‌యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌ కూతురు కవిత, బీజేపీ నుంచి డీఎస్‌ కుమారుడు అరవింద్‌‌ బరిలోకి దిగారు.

టీఆర్‌ఎస్‌‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 177 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా పోటీలో నిలిచారు. దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. కేసీఆర్ కుమార్తె కవిత మీద అరవింద్ 70,875 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతోపాటు తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎన్నిక‌ల‌కు దాదాపు ఆరు నెల‌ల క్రితం డీఎస్‌పై నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులంతా తీవ్రమైన నిందారోపణలు మోపుతూ అధిష్టానానికి ఫిర్యాదు లేఖ పంపారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. అయితే ఈ లేఖ విషయమై తెరాస అధినేత కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదే సమయంలో డీఎస్ కూడా వేచిచూసే ధోరణిని అవలంభిస్తూ, తన రాజ్యసభ పదవికి ఎసరు రాకుండా చూసుకుంటున్నారు.

డీఎస్ తనంతట తాను రాజీనామా చేసి ఏదైనా ఇతర పార్టీలో చేరితే, తెరాస తరఫున చేపట్టిన రాజ్యసభ పదవిని వదులుకోవాల్సిన ప్రమాదం తలెత్తే అవకాశం ఉండడం వల్లే డీఎస్ తెరాస సభ్యత్వానికి రాజీనామా చేయడం లేదని భావిస్తున్నారు. మరోవైపు డీఎస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన రాజ్యసభ పదవిలో యథాతథంగా కొనసాగేందుకు వీలు కల్పించినట్లవుతుందనే ఉద్దేశ్యంతో తెరాస అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో డీఎస్ అనుచరులంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. డీఎస్ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం తెరపైకి వచ్చినప్పటికీ, ప‌ద‌వి కోణంలో ఆయన చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని భావించారు. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ ఢిల్లీలో భేటీ అయి మంతనాలు జరిపారు. వ్యూహాత్మకంగా తన అనుచరులందరినీ కాంగ్రెస్‌లో చేర్పించి, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాను కూడా తెర వెనుక ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరిగింది. అలాంటి ది తాజాగా అమిత్‌షాతో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ బ‌లోపేతానికి డీఎస్ ద్వారా అమిత్‌షా పావులు క‌దుపుతున్నార‌నే చ‌ర్చ సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది.

No comments:

Post a Comment