Monday, February 3, 2020

హరీష్ అన్నా సారీ.. అన్‌బ్లాక్ చెయ్యండి

హరీష్ శంకర్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. 'గబ్బర్ సింగ్'తో అప్పట్లో పవన్‌కు మరపురాని హిట్ ఇచ్చిన హరీష్.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పవర్ స్టార్‌తో జట్టు కట్టబోతున్నాడు. ఇది పవన్ అభిమానుల్ని ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోంది. అసలు పవన్ రీఎంట్రీ మూవీ ఇది అయ్యుంటే బాగుండన్న ఫీలింగ్ వారిలో ఉంది.

ఈ సందర్భంగా హరీష్‌ను ట్వీట్ల వర్షంలో ముంచెత్తుతున్నారు. మామూలుగా పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో 'గబ్బర్ సింగ్'లో అలా చూపించాడు హరీష్. పవన్‌కు అతను స్వయంగా అభిమాని. కాబట్టి అభిమాని కోణంలో ఆ సినిమా తీశాడు. ఇది పవర్ స్టార్ అభిమానులందరినీ మురిపించింది. దీంతో ఇప్పుడు మళ్లీ హరీష్ తమను అలరించేలా సినిమా తీస్తాడని ఉత్సాహ పడుతున్నారు ఫ్యాన్స్. పవన్‌తో సినిమాలో తామేం కోరుకుంటున్నామో చెబుతూ హరీష్‌ను ట్యాగ్ చేసి మెసేజ్‌లు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 'దువ్వాడ జగన్నాథం' రిలీజ్ టైంలో హరీష్ వందల మంది పవన్ అభిమానుల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాకు ముందు పవన్ అభిమానులతో అల్లు అర్జున్‌కు వివాదం నడిచింది. 'సరైనోడు' దగ్గర మొదలైన ఆ గొడవ.. 'డీజే'కు వచ్చేసరికి ముదిరింది. దీంతో పవన్ అభిమానులు మూకుమ్మడిగా ఆ సినిమా మీద నెగెటివ్ ట్వీట్లు వేయడం.. టీజర్, ట్రైలర్లకు అన్ లైక్ కొట్టడం.. రిలీజ్ టైంలో నెగెటివిటీ స్ప్ర్రె డ్ చేయడం చేశారు. ఈ క్రమంలో హరీష్‌ను కూడా టార్గెట్ చేశారు. బన్నీతో ఎందుకు సినిమా తీశావని కూడా ప్రశ్నించారు. దీంతో అతను చాలామంది పవన్ అభిమానుల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది.

ఐతే ఇప్పుడు మళ్లీ పవన్‌తో సినిమా చేస్తుండటంతో.. అభిమానులు హరీష్‌కు సారీ చెప్పి మమ్మల్ని అన్ బ్లాక్ చేయమని మొరపెట్టుకుంటున్నారు. ఇలా అడుగుతున్న వాళ్లు వేలల్లో ఉండటం విశేషం. హరీష్ కూడా వారి విన్నపాలకు కరిగి అందరినీ అన్ బ్లాక్ చేయడం మొదలు పెట్టాడు.

No comments:

Post a Comment