Monday, February 15, 2021

డైలాగ్స్ బ‌ట్టీ ప‌ట్టిన అమ్మ‌డు

సినిమా కోసం రాత్రంతా డైలాగ్స్ బ‌ట్టీ ప‌ట్టి.... తెల్లారిన త‌ర్వాత షూటింగ్‌కు వెళ్లిన‌ట్టు కోలీవుడ్ అమ్మ‌డు వ‌ర‌ల‌క్ష్మి చెప్పారు. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో  ‘నాంది’ చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమాను సతీష్‌ వేగేశ్న నిర్మించారు. ఈ  నెల 19న విడుదల కానున్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా కీల‌క పాత్ర పోషించారు.

సినిమా విడుద‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఆమె త‌న మ‌నోభావాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న‌ను తాను ఓ ఇమేజ్ చ‌ట్రంలో ప‌రిమితం చేసుకోవాల‌ని భావించ‌లేద‌న్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రోజే ... ఒకే త‌ర‌హా పాత్ర‌లు చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి తెలిపారు. 

ప‌రిపూర్ణ‌మైన న‌టిగా గుర్తింపు పొందాలంటే అన్ని ర‌కాల పాత్ర‌లు చేయాల‌న్నారు. అదే త‌న ఆలోచ‌న కూడా అని ఆమె చెప్పుకొచ్చారు. అన్నిటికి మించి న‌ట‌న అంటే త‌న దృష్టిలో ఉద్యోగం లాంటిద‌న్నారు. శ్ర‌మ‌ను బ‌ట్టి ఫ‌లితం ఉంటుంద‌ని తాను న‌మ్మే సిద్ధాంత‌మ‌న్నారు.  

నాంది సినిమా సంగ‌తుల‌ను ఆమె చెప్పారు. ఈ సినిమాలో ఆద్య అనే క్రిమినల్‌ లాయర్‌ పాత్ర చేసిన‌ట్టు తెలిపారు.  ఈ పాత్ర తన‌కు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింద‌న్నారు.

లాయర్‌ పాత్ర కావ‌డంతో పెద్ద‌పెద్ద‌ డైలాగులు చెప్పాల్సి వచ్చేద‌న్నారు. దీంతో స్కూల్‌ పిల్లల్లా రాత్రిళ్లు డైలాగ్స్‌ బట్టీ పట్టి, ఉదయం షూటింగ్‌కి వెళ్లేదాన్న‌ని ఆమె తెలిపారు. ద‌క్షిణాదిలో 30కి పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించాన‌ని, ఇకపై కూడా అదే ఒర‌వ‌డి కొన‌సాగిస్తాన‌న్నారు.

No comments:

Post a Comment