Monday, February 15, 2021

ఫాస్టాగ్.. ఇవాళ్టి నుంచి డబుల్ మోత

 

ఫాస్టాగ్ పెట్టుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందని భావించిన వాహనదారులకు నిరాశ ఎదురైంది. ఇకపై ఫాస్టాగ్ గడువును పొడిగించేది లేదని కేంద్రం ప్రకటించింది. దీంతో ఇవాళ్టి నుంచి జాతీయ రహదారులపైకి వచ్చే ఫోర్-వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి అయింది. అయితే ఇక్కడితో ఇది అయిపోలేదు. ఫాస్టాగ్ లేని వాహనాలకు ఈరోజు నుంచి రెట్టింపు చార్జీ వసూలు చేయబోతున్నారు.

అవినీతిని అరికట్టడంతో పాటు, ఇంధనాన్ని ఆదా చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్ని క్యాష్-లెస్ గా మార్చింది కేంద్రం. ఇందులో భాగంగా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు గడువు పెంచిన కేంద్రం ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జాతీయ రహదారులపై ఫాస్టాగ్ విధివిధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఈరోజు నుంచి ఫాస్టాగ్ లేకుండా నేషనల్ హైవేలపైకి వస్తే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే భారీ నుంచి అతిభారీ వాహనాలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఓ మార్గంలో మాత్రం డబ్బు చెల్లించి టోల్ గేట్ దాటే సౌకర్యం ఉంచుతున్నారు. ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే  అందుబాటులో ఉంటుంది.

గడువు పొడిగించకపోగా.. జరిమానాగా రుసుమును కూడా రెట్టింపు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత వాహనాల్లో ఇప్పటికీ కొంతమంది ఫాస్టాగ్ పెట్టుకోలేదు. అటు కొన్ని రకాల కమర్షియల్ వాహనాలకు సంబంధించి కూడా ఓనర్లు ఫాస్టాగ్ విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇలాంటి వాళ్లతో ఇప్పటికే జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాల ముందు క్యూలు కనిపిస్తున్నాయి.

కొందరికి అప్పటికప్పుడు ఫాస్టాగ్ సౌకర్యాన్ని కల్పించేలా హైవేల పక్కనే ఔట్ లెట్లు ఏర్పాటుచేస్తున్నారు. టైమ్ లేని మరికొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల మధ్య, రెట్టింపు మొత్తం చెల్లించి టోల్ గేట్ దాటుతున్నారు. 

పెట్రో మోత టైపులో, దశలవారీగా టోల్ ప్లాజా రేట్లను పెంచేందుకు.. నొప్పి తెలియకుండా వాత పెట్టేందుకు ఈ ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. ఈ వాదనలో నిజం ఎంతో రాబోయే రోజుల్లో తేలుతుంది.

No comments:

Post a Comment