Friday, February 27, 2015

రివ్యూ: బాబోయ్... గోల‌-'రామ్ లీల‌'

క‌థ‌పై ఆరు నెల‌లు క‌స‌ర‌త్తు చేశా.. అంటాడు హీరో!
క‌థ విన‌గానే ఫ్లాటైపోయా.. డంగైపోయా... అని చెబుతాడు నిర్మాత‌!
ఒక్క‌టే నేరేష‌న్‌... విన‌గానే ఒప్పేసుకొన్నా... అంటుంది హీరోయిన్‌.
అస‌లు ఇలాంటి క‌థే రాలేద‌ని... ఒట్టేస్తాడు ద‌ర్శ‌కుడు.
ఇవ‌న్నీ విని.. ఎక్క‌డో ఓ ఆశ చిగురిస్తుంది.
నిజంగా వీళ్లు నిజ‌మే చెబుతున్నారేమో అన్న మాయ క‌లుగుతుంది.
ఈసారైనా మంచి సినిమా చూస్తామేమో అన్న ఆశ‌తో టికెట్టు తెగుతుంది.
థియేట‌ర్లో త‌లుపులు మూస్తారు.
లైట్లు ఆర్పుతారు... టైటిళ్లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర‌వాత నుంచి బాదుడే.. బాదుడు.

దీని కోసమా ఇంత డ‌బ్బా కొట్టారు.. అంటూ మూడో సీన్లో నే పెద‌వి విరుపు.
తెలివైన వాడు ఇంట్ర‌వెల్ రాకుండానే పారిపోతే.. ఆశాజీవి మాత్రం స‌గం త‌ల‌నొప్పితో బ‌య‌ట‌కు రాలేక‌... శుభం కార్డుకోసం పిచ్చి చూపులు చూస్తుంటాడు. ఇంత గొప్ప అనుభూతి క‌లిగించిన చిత్రం
రామ్ లీల‌... ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకొందాం.
క్రిష్ (అభిజిత్) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌.   సశ్య (నందిత)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు.  సశ్య తండ్రి పోలీసాఫీసర్ (నాగినీడు).  క్రిష్ త‌న కుటుంబంతో స‌హా స‌శ్య ఇంటికి వెళ్లి.. పెళ్లి సంబంధం మాట్లాడ‌తారు. స‌శ్య నాన్న కూడా ఈ పెళ్లికి ఒప్పుకొంటాడు. అలా.. క్రిష్ - స‌శ్య‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రుగుతుంది. ఫ‌స్ట్ నైట్ రోజున స‌శ్య త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెడుతుంది. ''అంద‌రూ ఉద్యోగాల పేరిట అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు. పండ‌గ‌ల‌కు ఇండియా వ‌స్తున్నారు. డీవీడీల్లో దేశాన్ని చూసుకొంటున్నారు. ఇది క‌రెక్ట్ కాదు.. మీరు ఏ సింగ‌పూరో, మ‌లేసియానో ట్రాన్స్ ఫ‌ర్ చేసుకోండి.. అప్పుడు ఇండియా మ‌రింత ద‌గ్గ‌ర అవుతుంది'' అంటుంది. భార్య మాట కాద‌న‌లేక అమెరికాలో త‌న ఉద్యోగాన్ని వ‌దిలి మ‌లేసియా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాడు. వారం రోజులు ఆఫీసుకు సెల‌వు పెట్టి.. స‌శ్య‌తో లాంగ్ ట్రిప్ వేయాల‌నుకొంటాడు. రోడ్ జ‌ర్నీ ప్లాన్ చేస్తాడు. కానీ.. స‌శ్య ఓ లెట‌ర్ రాసి.. జంప్ అయిపోతుంది. ''నేను ఓ అబ్బాయిని ప్రేమించా.. త‌ను ఇక్క‌డే ఉంటాడు. అందుకే ఏరి కోరి మ‌లేసియా ట్రాన్స్ ఫ‌ర్ చేయించా. నా ప్రేమ కోసం నిన్ను వాడుకొన్నా..'' అంటుంది. దాంతో క్రిష్‌కి పిచ్చిప‌ట్టినంత ప‌నౌతుంది. స‌శ్య కోసం వెత‌క‌డం మొద‌లెడ‌తాడు. ఆ ప్ర‌యాణంలో రామ్ (హ‌వీష్‌) ప‌రిచ‌యం అవుతాడు. రామ్ ది ప్లేబోయ్ క్యారెక్ట‌ర్‌. జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌నుకొనే మ‌న‌స్త‌త్వం. ముందు రామ్ అంటే గిట్ట‌ని క్రిష్ క్ర‌మ‌క్ర‌మంగా స్నేహం చేస్తాడు. వీరిద్ద‌రి ప్ర‌యాణం ఎక్క‌డ ఆగింది??  క్రిష్ గురించి రామ్ తెలుసుకొన్న నిజం ఏమిటి?  స‌శ్య ఎక్క‌డికి వెళ్లిపోయింది??  ఇవ‌న్నీ రామ్ లీల చూసి తెలుసుకోవాలి.
క‌థ ఇలా చెబితే మీకూ ఈ సినిమాలో మేట‌రుంద‌న్న ఆశ క‌లుగుతుంది క‌దూ. అమ్మో... అలా మాత్రం ఫిక్స‌యిపోకండి. ఎందుకంటే ఈ క‌థ రాయ‌డానికి బాగుంది కానీ - చూడ్డానికి బీభ‌త్సంగా ఉంటుంది.  కార‌ణం ఏంటంటే.. ఒక్క‌ట‌ని ఏం చెప్తాం??  అడుగ‌డుక్కీ సీటు కింద ఓమందు పాత‌ర పేలుతూనే ఉంటుంది.  ఈ క‌థ‌లో రెండు ట్విస్టులున్నాయ్‌. అవి రెండూ ప్రేక్ష‌కుడు ఊహించేవే. సినిమా ప్రారంభానికి ట్విస్టు మ‌ధ్య స్టోరీ న‌డ‌పాలి క‌దా..? అది కాస్త అతుకుల బొంతలా త‌యారైంది. మ‌రీ ముఖ్యంగా స‌ప్త‌గిరి కామెడీ.. అదో న‌ర‌కం. స‌ప్త‌గిరి కామెడీకి న‌వ్వులు మాత్ర‌మే కాదు.. ఏడుపు కూడా వ‌స్తుంద‌ని తొలిసారి నిరూపించిన సినిమాగా రామ్‌లీలా కీర్తిని ద‌క్కించుకోవ‌డం ఖాయం. స‌ప్త‌గిరి దాదాపు 30 నిమిషాల పాటు ప్రేక్ష‌కుల్ని రాచి రంపాలు పెట్టాడు. స‌ప్త‌గిరి పాత్ర‌లో చంద్ర‌ముఖి నుంచి చంద్ర‌క‌ళ వ‌ర‌కూ భ‌యంక‌ర‌మైన యాంగిల్స్ అన్నీ చూపించారు. ఇక అలీ గురించి చెప్పుకోవాలి. అలీ.. ఈ సినిమాలో వాక‌ర్‌గా క‌నిపిస్తాడు. వాక‌ర్ అని చెప్పి అత‌నితో ప‌రుగులు పెట్టించారు. గంట‌కు 200కిలో మీట‌ర్లు ప‌రిగెట్టే మ‌నిషంట‌.. వాడు పెట్రోలు మాత్ర‌మే తాగుతాడ‌ట‌... అమ్మో.. ఇలాంటి చిత్ర‌విచిత్రాలు ఇంకెన్నో.
ద‌ర్శ‌కుడు క‌థ రాసుకొంటున్న‌ప్పుడు ఇదో గ‌మ్యంలాంటి స్టోరీ అని క‌ల‌లుక‌నుంటాడు. నిర్మాత‌నీ అలానే క‌న్విన్స్ చేసుంటాడు. గ‌మ్యంలో శ‌ర్వానంద్ ఇక్క‌డ అభిజిత్‌. అక్క‌డ అల్ల‌రి న‌రేష్‌.. ఇక్క‌డ హ‌వీష్. ఇలా పోల్చుకొని ఈ పాత్ర‌ల్ని చేసేశారు. అభిజిత్ ఫ‌ర్లేదు గానీ హ‌వీష్‌కి ఆ బాడీ లాంగ్వేజ్ అస్స‌లు సూటు కాలేదు. ర‌వితేజ‌ల మాస్ ఫాలోయింగ్ తెచ్చేసుకోవాల‌న్న తాప‌త్ర‌యం క‌నిపించింది. అత‌ని బాడీ లాంగ్వేజ్‌, డాన్సులు,డైలాగ్ డెలివ‌రీ... అమ్మో.. అదో ప్ర‌హ‌స‌నం. డ‌బ్బులుంటే హీరోలైపోవ‌చ్చు గానీ, న‌టులు కాలేరు అని హ‌వీష్ నిరూపించాడు. నందిత ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల్లో ఇదో శుద్ద వేస్ట్ క్యారెక్ట‌ర్‌. చివ‌ర్లో క‌థానాయిక పాత్ర ఔచిత్యం కూడా ఘోరంగా దెబ్బ‌తింది. ఈ సినిమాతో ఆమెకు ఒరిగిందేం ఉండ‌దు. మిగిలిన పాత్ర‌ల గురించి మాట్లాడుకోవ‌డానికి ఏం లేదు. రొటీన్‌.. రొటీన్‌....
డ‌బ్బులు బాగా ఉన్నాయ్‌. అందుకే ఖ‌ర్చు పెట్టారు. క‌థ‌పై దృష్టి పెడితే బాగుండేది. ఎస్‌.గోపాల‌రెడ్డి కెమెరా ప‌నిత‌నం త‌ప్ప‌.. ఈ సినిమాలో మ‌న‌ల్ని ఆక‌ర్షించే పాయింట్ ఏదీ క‌నిపించ‌ద‌దు. చిన్నా సంగీతంలో ఒక‌ట్రెండు పాట‌లు బాగున్నా.. అందులో హ‌వీష్ క‌నిపిస్తేనే ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి క‌థ‌.. అంత తేలిగ్గా ఒప్పేసుకొన్న నిర్మాత ధైర్యానికి జోహ‌ర్ చెప్పాలి. కేవ‌లం హ‌వీష్ పాత్ర ఎలివేట్ చేయ‌డానికి తీసిన సినిమాలా ఉందంతే. విస్సు అందించిన మాట‌లు ఎక్క‌డా పేల‌లేదు. ఏదో బ‌ల‌వంతంగా రుద్దిన‌ట్టు అనిపించే భావాలే వినిపించాయి.
ఇలాంటి క‌థ‌లు గ‌తంలో చాలా చూశాం. అయితే రోడ్ ట్రిప్ అన్న పాయింట్‌కి పాత క‌థ జోడించాడు ద‌ర్శ‌కుడు. మ‌ధ్య‌లో మంచి సీన్లు రాసుకొంటే.. ఫీల్ క్యారీ చేస్తే, కామెడీ న‌వ్విస్తే ఈసినిమా కాస్త బాగుండేదేమో..??? 

No comments:

Post a Comment