Monday, January 11, 2016

అసహనం.. అమీర్‌ఖాన్‌కి దెబ్బ మీద దెబ్బ.!

బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 'ఓ భారతీయుడిగా నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. దేశం పట్ల అమితమైన గౌరవం వుంది..' అని వివరణ ఇచ్చుకున్నా, 'అసహనం'పై అమీర్‌ఖాన్‌ తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేది లేదని చెప్పడం.. కాస్త లేటుగా అయినా ఆయనకు దెబ్బ మీద దెబ్బ కొడ్తోంది. 'అసహనం'పై అమీర్‌ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న ఓ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థకు షాక్‌ తగిలింది. సోషల్‌ మీడియా వేదికగా, ఆ సంస్థపై అమీర్‌ఖాన్‌ అభిమానులే అసహనం వ్యక్తం చేశారు. దాంతో, ఆ వ్యాఖ్యలకూ తమకూ సంబంధం లేదనీ, ఆయన తమకు బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రమేనని వివరణ ఇచ్చుకుంది. దాంతో, ఆ సంస్థపై నెటిజన్లు కాస్త ఆగ్రహం తగ్గించుకున్నారు. ఆ వివాదం అలా చల్లారింది. అయితే ఇటీవలే 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' ప్రచారకరక్తగా అమీర్‌ఖాన్‌ని తప్పించడంతో, మరోమారు 'అమీర్‌ఖాన్‌ అసహనం' అనే అంశం వార్తల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాజాగా, రోడ్‌ సేఫ్టీకి సంబంధించి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అమీర్‌ఖాన్‌ని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఇదొక్కటే కాదు, అమీర్‌ఖాన్‌ చేతిలో వున్న చాలా అవకాశాలు ఇప్పుడు అటకెక్కేలా వున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాగా, అమీర్‌ఖాన్‌కి వ్యతిరేకంగా ఈ తొలగింపు ప్రక్రియ నడవడంలేదనీ, కాంట్రాక్టులు ముగుస్తుండగా, కొత్త ఒప్పందాలు వేరే వ్యక్తులతో జరుగుతున్నాయనీ, ప్రచార రంగంలో ఇది సర్వసాధారణమనే వాదన విన్పిస్తోంది. అమీర్‌ఖాన్‌ సైతం ఈ వ్యవహారంపై ఆచి తూచి స్పందిస్తున్నాడు. మరోపక్క, అమీర్‌ఖాన్‌తో సినిమాలు చేయాలనుకుంటున్నవారు ఒకటికి పదిసార్లు పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తుండడం గమనార్హం. 'దేశంలో మత అసహనం పెరిగిపోతోంది.. ఈ అసహనం నేపథ్యంలో నా భార్య దేశంలో వుండాలంటేనే భయపడుతోంది. వేరే దేశానికి వెళ్ళిపోదామా అని అడుగుతోంది..' అంటూ ఓ సందర్భంలో అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అసహనం గురించి ఆయన మాట్లాడొచ్చుగాక, అది ఆయన అభిప్రాయం. కానీ దేశంలో వుండలేనంత భయంకరమైన పరిస్థితులు వున్నాయని ఆయన చెప్పడమే ఇంత రగడకు కారణం. దాదాపు ఇలాంటి వివాదమే బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌నీ వెంటాడినా, చేసిన అసహన వ్యాఖ్యలకు షారుక్‌ వివరణ ఇచ్చి, తప్పయిపోయిందని ఒప్పుకోవడంతో.. తేలిగ్గానే షారుక్‌ ఆ వివాదంలోంచి బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్‌పైన కూడా 'అసహనం' వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment