Wednesday, January 6, 2016

అసహనం.. అమీర్‌ఖాన్‌ని పీకేశారు.!

బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌కి పెద్ద షాక్‌ 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా'కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇప్పటిదాకా పనిచేసిన ఆయన్ను తొలగించేశారు. దేశం గొప్పతనాన్ని చాటి చెబుతూ, విదేశీ టూరిస్టులను దేశానికి రప్పించేందుకు కేంద్ర పర్యాటక శాఖ 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' పేరుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు అమీర్‌ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న విషయం విదితమే. అయితే, గత నవంబర్‌లో 'అసహనం' గురించి అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'దేశంలో అసహనం పెరిగిపోతోంది. ఈ అసహనం కారణంగా భద్రత కొరవడ్తోంది. నా భార్య కిరణ్‌రావు, దేశంలో తనకు భద్రత లేదనీ, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పింది.. అసహనం దేశానికి మంచిది కాదు..' అంటూ లెక్చర్‌ దంచేశాడు అమీర్‌ఖాన్‌. బీహార్‌ ఎన్నికల వేళ రాజకీయ కోణంలో 'అసహనం' అంశం తెరపైకొచ్చింది. దానికి కాంగ్రెస్‌ పార్టీ విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. కాంగ్రెస్‌ మద్దతుదారులైన పలువురు ప్రముఖులు తమ అవార్డుల్ని తిరిగిచ్చేశారు. షారుక్‌ఖాన్‌ కూడా అసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు. అమీర్‌ఖాన్‌ అలా కాదు, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానంటూ, ఇంకా అహంకారమే ప్రదర్శించాడు. ఇవన్నీ పరిగణణలోకి తీసుకుని 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న అమీర్‌ఖాన్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే బహుశా 'ఒప్పందం ముగియడంతోనే' అమీర్‌ఖాన్‌ని తొలగించి వుంటారన్న వాదన కూడా తెరపైకొస్తోంది. ఏదిఏమైనా, వ్యక్తిగత అభిప్రాయం పేరుతో, సొంత అభిప్రాయాల్ని, అనుమానాల్ని దేశానికి ఆపాదించడం అమీర్‌ఖాన్‌ లాంటి స్టార్స్‌కి తగదు. దేశంలో అమీర్‌ఖాన్‌ చెబుతున్నట్లు మత అసహనమే వుంటే, ఆయన ఇప్పుడు ఇంత పెద్ద స్టార్‌ ఎలా అవుతాడు.?

No comments:

Post a Comment