Monday, May 16, 2016

మహాత్మా మన్నించు: వీళ్ళకీ స్వేచ్ఛ కావలెను.!


అమీర్‌ఖాన్‌.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. దేశంలో అత్యంత ప్రజాదరణ వున్న సినీ ప్రముఖుల్లో అమీర్‌ఖాన్‌ ముందు వరుసలో వుంటాడు. బాక్సాఫీస్‌ వద్ద అమీర్‌ఖాన్‌ సినిమా సృష్టించే రికార్డులు అలా ఇలా వుండవు. అమీర్‌ఖాన్‌ చెప్పిందే వేదం ఆయన అభిమానులకి. ఏదన్నా సోషల్‌ కాజ్‌ కోసం అమీర్‌ఖాన్‌ పిలుపునిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు, పండగ చేసుకుంటారు.. ఆ సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అంతటి ప్రజాదరణ వున్న వ్యక్తి అమీర్‌ఖాన్‌. 
వివాదాస్పద వ్యాఖ్యలు చేయొచ్చు.. దాన్ని బావ ప్రకటనా స్వేచ్ఛ అని ఆయనే అనొచ్చు. అయినా, ఇది తప్పు.. అని మాత్రం ఎవరూ తమ అభిప్రాయం చెప్పకూడదు. దేశం నాకేమిచ్చింది.? అని అమాయకంగా ప్రశ్నిస్తాడీయన. ఔను, దేశంలో బతకలేనని తన భార్య చెప్పిందంటే, దేశం ఈయనగారి కుటుంబానికి స్వేచ్ఛ ఇవ్వలేదనే కదా అర్థం.! దేశంలో అసహనం పెరిగిపోయిందట. అయ్యగారి ఆవేదన ఇది. ఎంత దారుణం ఇది.? అయినాసరే, భావ ప్రకటనా స్వేచ్ఛ.. అని జనం సరిపెట్టుకున్నారు. అదీ సహనం అంటే. ఇక్కడ సహనం లోపించింది అమీర్‌ఖాన్‌కి మాత్రమే. ఆ విషయం ఆయనకీ అర్థమయ్యింది.. అయితే, కాస్త లేటుగా. 
ఇక, తాజాగా 'లిక్కర్‌ కింగ్‌' విజయ్‌మాల్యాకి స్వేచ్ఛ కావాల్సి వచ్చింది. ఆయన భారతదేశంలో భద్రతను కోరుకుంటున్నారు. సిగ్గు సిగ్గు, 9 వేల కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసిన విజయ్‌ మాల్యా, ఏ భద్రతా లేకుండానే ఇన్నాళ్ళూ దేశంలో మనుగడ సాధించారా.? వ్యాపారవేత్తగా అంచలంచెలుగా ఎదిగారా.? హీరోయిన్లతో ఎంజాయ్‌మెంట్‌, రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు.. బహుశా దేశంలో ఇంకే వ్యాపారవేత్త చేయనన్ని జల్సాలు విజయ్‌మాల్యా చేశారనడం అతిశయోక్తి కాదు. అయినా, ఈయనగారికి దేశంలో భద్రత కరువయ్యింది. ఎంత హాస్యాస్పదమిది.! 
మామూలుగా ఓ సాధారణ ఉద్యోగి బ్యాంకుకి వెళ్ళి లోన్‌ కోసం అప్లికేషన్‌ పెడితే, లోన్‌ ఇచ్చేందుకు నానా రకాల కండిషన్స్‌ వుంటాయి. అన్నీ సరిచూసుకున్నాకే బ్యాంకులు లోన్లు ఇస్తాయి. అది కూడా లక్ష, రెండు లక్షల మొత్తానికే ఈ తతంగమంతా. అలాంటిది, లిక్కర్‌ కింగ్‌ అన్న బ్రాండ్‌ చూసి, విజయ్‌ మాల్యాకి వందల కోట్లు, వేల కోట్లు అప్పులు ఇచ్చేశాయి బ్యాంకులు. దీన్నేమంటారు.? వ్యాపారవేత్తగా విజయ్‌మాల్యాకి ఇంతకన్నా స్వేచ్ఛ ఇంకెక్కడ దొరుకుతుంది.? 
తన మీద ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో, ఆ వెంటనే దేశంలో స్వేచ్ఛ, భద్రత దొరకదని అర్థమయ్యింది విజయ్‌మాల్యాకి. విదేశాలకు పారిపోయాడాయన. 9 వేల కోట్లు అప్పులు తీర్చాల్సిన వ్యక్తి, భద్రత, స్వేచ్ఛ కల్పిస్తేనే భారతదేశానికి వస్తున్నాడంటే, అసలు దేశం ఎలాంటి వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా, వ్యాపారవేత్తలుగా తయారుచేస్తోందో మొత్తం వ్యవస్థ తనను తాను ప్రశ్నించుకోవాలి. 
అన్నట్టు, విజయ్‌మాల్యా వ్యాపారవేత్త మాత్రమే కాదు, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నాడు. పెద్దల సభ అని పిలుస్తాం రాజ్యసభని. లాంటి రాజ్యసభకి విజయ్‌మాల్యాని పంపించిన, మన వ్యవస్థని నిజంగానే మనం ప్రశ్నించాలి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం, చనుబాలు తాగి, తల్లి రొమ్ము గుద్దడం.. ఇలాంటివన్నీ విజయ్‌మాల్యాకి వర్తిస్తాయేమో.! 
ఇంతకీ, విజయ్‌మాల్యా కోరుకునే స్వేచ్ఛ ఏమిటి.? ఎలాంటి భద్రత ఆయనకు కావాలి.? బ్యాంకుల్ని ముంచేసినా ఆయన్ని ప్రశ్నించకూడదు, నేరస్తుడిగా ముద్రపడ్డా ఆయన్ను చట్ట సభలనుంచి సాగనంపకూడదు. ఇదేనా ఆయన కోరుకుంటున్నది.? మహాత్మా మన్నించు, స్వేచ్ఛ.. స్వాతంత్య్రం, భద్రత.. అనే పదాలకి అర్థాలు మార్చేస్తున్నందుకు.

No comments:

Post a Comment