Wednesday, April 12, 2017

బాహుబలి 2 చూడాలంటే జేబుకు చిల్లు తప్పదు

మరో రెండు వారాల్లో రానున్న బాహుబలి 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేమికులు. ఆ మేరకు ఫస్ట్ డే నే చూసేందుకు ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఆర్కా మీడియా నిర్మించిన ఈ మూవీ మీద దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ నడుస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. టికెట్ల కోసం అప్పుడే లాబీయింగ్ కూడా కొన్ని చోట్ల మొదలు పెట్టేసారు. ఎన్ని థియేటర్లు వేసినా సరిపోయేలా లేదు పరిస్థితి చూస్తుంటే. స్క్రీన్లు తక్కువగా ఉండే బి సి సెంటర్స్ లో పరిస్థితి అదుపు తప్పడం ఖాయం అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే దానికి తగ్గ సన్నాహాలతో సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఈ సినిమాని బెనిఫిట్ షో లేదా ఫస్ట్ డే చూసే తీరాలి అని దీక్ష బూనిన వాళ్ళు కొట్లలో ఉన్నారు. 27 అర్ధ రాత్రి నుంచే జాతర మొదలు పెట్టేందుకు ప్రభాస్ ఫాన్స్ కూడా సకలం సిద్ధం చేసుకుంటున్నారు. కాని మొదటి రోజు ఈ సినిమాని చూడాలని కలలు కంటున్నా సగటు సినిమా ప్రేమికులు, మధ్య తరగతి జీవులు మాత్రం షాక్ అయ్యే న్యూస్ ఒకటి వచ్చింది. బాహుబలి 2 విడుదలైన తొలి వారం టికెట్ ధర కౌంటర్ లోనే 200 రూపాయలు ఉండేలా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా సైడ్ రెవిన్యూ అధికారులకు ఆ మేరకు అనధికార ఉత్తర్వులు అందాయని తెలిసింది. అంటే నేరుగా కౌంటర్ లో కొనాలన్నా భారీ మొత్తం సమర్పించుకోక తప్పదు. కౌంటర్ రేట్ ఇంత ఉంటే ఇక బ్లాకు లో ఎంత ఉండొచ్చో ఊహించుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు ప్రేక్షకులు. కనీసం 700 రూపాయలు మొదలు వెయ్యి, పదిహేను వందల దాకా టికెట్ రేట్ ఎగబాకే అవకాశం ఉంది. ప్రభుత్వం భారీ సినిమాల పట్ల ఉదాసీనంగా ఉండటం వరకు బాగానే ఉందని, అలాగే పెద్ద మాఫియా గా మారిన బ్లాకు టికెట్ల దందా నియంత్రించే చర్యలు చేపడితే బాగుంటుంది అని కోరుతున్నారు ఫాన్స్. మన అమాయకత్వం కాని ఈ గోడు పట్టించుకునేదెవ్వరు. సినిమా కావాలా వెయ్యి కొట్టు లేదా ఒక వారం ఆగు అంటూ నడుపుతున్న తీరు చూస్తుంటే జనం పైరసీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థమవుతుంది.

No comments:

Post a Comment