Wednesday, April 12, 2017

అందరూ శాఖహారులే అయితే.. ఫిరాయింపు 'కోడి' సంగతేంటి?

ఫిరాయింపు రాజకీయాలకు మేం వ్యతిరేకం.. - భారతీయ జనతా పార్టీ మేమే ఫిరాయింపు బాధితులం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపుల్ని నిరోధించేందుకు బలమైన చట్టం రావాల్సిందే.. - తెలుగుదేశం పార్టీ గతంలో ఫిరాయింపుల కారణంగా నష్టపోయాం.. ఫిరాయింపుల నిరోధానికి చట్టం తీసుకొస్తామంటే, ముందుగా మేమే మద్దతిస్తాం.. - తెలంగాణ రాష్ట్ర సమితి ఫిరాయింపు అన్యాయం, అక్రమం, దుర్మార్గం.. స్పీకర్‌ వ్యవస్థ తనకున్న విశేషాధికారాల్ని దుర్వినియోగం చేస్తోంది.. ఫిరాయింపుల నిరోధం కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాల్సిందే.. - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఫిరాయించగానే అనర్హత వేటు పడాల్సిందే.. - కాంగ్రెస్‌ పార్టీ దేశంలో రాజకీయాలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పీవీ నరసింహారావు హయాంలోనూ పార్టీ ఫిరాయింపులు చూశాం.. మన్మోహన్‌సింగ్‌ హయాంలో చూశాం.. బీజేపీ హయాంలో చూస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో పరిస్థితి ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు మరీ దారుణం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతున్నాయిక్కడ. ఎందుకలా.? అంటే, అందరూ 'శాఖాహారం' మాటలే చెబుతున్నారు. అందరూ శాఖాహారులేగానీ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అందరిదీ ఒకే మాట.. ఫిరాయింపుల చట్టం మరింత బలంగా వుండాలని. కానీ, పార్టీ ఫిరాయింపుల్ని నిరోదించే దిశగా అధికారంలో వున్నవారెవరూ కనీసపాటి చిత్తశుద్ధి చూపించరు. 'అప్పుడు నువ్వు గడ్డి తిన్నావ్‌.. ఇప్పుడు నేను అదే గడ్డి తింటున్నా..' అంటూ, నిస్సిగ్గుగా గడ్డి తింటున్న నైజాన్ని ప్రదర్శిస్తున్నాయి అధికారంలో వున్న పార్టీలు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేస్తున్నది అదే. 'రాజకీయ వ్యభిచారం..' అని చంద్రబాబు విమర్శించొచ్చు.. కానీ, అలా చంద్రబాబు ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తే మాత్రం, 'ఆ నైతిక హక్కు' ఇంకెవరికీ వుండకూడదట. ఇదెక్కడి రాజకీయం.? ఇది చంద్రబాబు మార్క్‌ రాజకీయం. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలంటూ బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నామని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్‌, ఫిరాయింపు తెలంగాణని ప్రపంచానికి చూపిస్తోంది నిస్సిగ్గుగా. ఇంతకీ, బీజేపీ భయమేంటట.? ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయింపుల్ని సమర్థించబోమని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. అలాంటప్పుడు, ఆలస్యమెందుకు.. వెంటనే ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేసి, ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసెయ్యొచ్చు కదా.! పోనీ, అప్పటిదాకా ఆలస్యమవుతుందనుకుంటే, మిత్రపక్షం టీడీపీపై ఒత్తిడి తీసుకొచ్చి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించెయ్యాలి. కానీ, బీజేపీ ఆ పని చెయ్యదు. దొంగతనం కంటే, ఆ దొంగతనాన్ని సమర్థిస్తున్నవారిదే పెద్ద నేరం.. అంటారు. మరి, ఇక్కడ టీడీపీ చేస్తున్న నేరాన్ని ఉపేక్షిస్తున్న బీజేపీని ఏమనాలి.? ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో తమ 'నికృష్ట' రాజకీయాల వ్యవహారం బయటపడ్తుంది గనుక, పార్టీ ఫిరాయింపులపై 'గోడ మీద పిల్లి వాటం' ప్రదర్శిస్తోందన్నమాట భారతీయ జనతా పార్టీ. ముందే చెప్పుకున్నాం కదా, అన్ని రాజకీయ పార్టీలదీ ఫిరాయింపుల విషయంలో ఒకటే వైఖరి. అదే, ద్వంద వైఖరి. అందరూ 'ఉత్తమ' ప్రవచనాలే చెబుతారు.. ఆచరించేటప్పుడు మాత్రం అన్నీ అకృత్యాలే. అందరూ శాఖహారులే.. కానీ, ఫిరాయింపు అనే 'కోడి' మాత్రం మాయమైపోయింది. రాజకీయ వ్యభిచారం అనే మాట కన్నా కఠినమైనది ఇంకేముంటుంది.? అయినా, నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమంటే రాజకీయ పార్టీలు రాజకీయం చేస్త్నుట్టా.? ఇంకేదన్నా చేస్తున్నట్టా.? బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీలే కాదు, టీడీపీ, టీఆర్‌ఎస్‌ లాంటి ప్రాంతీయ పార్టీలూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది.!

No comments:

Post a Comment