Friday, December 15, 2017

జల్లికట్టుకి సిద్ధమవుతున్న కోలీవుడ్‌

తమిళనాడులో జల్లికట్టు అక్కడి రాజకీయ పార్టీలకీ, సినీ పరిశ్రమకీ భలే పబ్లిసిటీ స్టంట్‌గా మారిపోయింది. ఏడాది క్రితం దాదాపు ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు మించి, సినీ ప్రముఖులు 'జల్లికట్టు' పేరుతో పబ్లిసిటీ స్టంట్స్‌ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. జల్లికట్టు వివాదం పేరు చెప్పి, 'పబ్లిసిటీ'ని ఏరుకుంటూనే, పబ్లిసిటీ స్టంట్లు చేయొద్దంటూ సినీ ప్రముఖులకి, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ 'ఉచిత సలహా' ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం. 
వాళ్ళూ, వీళ్ళూ అనేంటి.. మొత్తంగా తమిళ సినీ పరిశ్రమ జల్లికట్టుకి అనుకూలంగా నినదించింది. సినీ నటి త్రిష, పెటా తరఫున జల్లికట్టుకి వ్యతిరేకంగా మాట్లాడిందంటూ ఓ వార్త బయటకు రావడంతో, ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు షురూ అయ్యాయి. ఆ దెబ్బకి 'పెటా'తో అనుబంధాన్నీ త్రిష తెంచుకోవాల్సి వచ్చింది. జల్లికట్టుకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినాసరే, తమిళ సమాజం నుంచి వారిని 'వెలి' వేసెయ్యాలన్న దిశగా అక్కడ ఉద్యమం ఉధృతరూపం దాల్చిన విషయం విదితమే. 
నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ అయితే జల్లికట్టు ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇంకా చాలామంది ఈ తరహా 'స్టంట్స్‌' చేసినా, అందరిలోకీ లారెన్స్‌ చేసిన హడావిడే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
ఇక, ఇప్పుడు మళ్ళీ జల్లికట్టు హడావిడి మొదలయ్యింది. ఈసారి జల్లికట్టు ఉత్సవాల్లో సందడి చేసేందుకు తమిళ సినీ ప్రముఖులు సమాయత్తమవుతున్నారట. సంక్రాంతికి ముందు నుంచే జల్లికట్టు ఉత్సవాల్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలూ అందుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు జల్లికట్టుని నిషేధించినా, కేంద్రం చట్ట సవరణ ద్వారా జల్లికట్టుకి అనుమతిచ్చిన విషయం విదితమే. 'పెటా' మాత్రం, జల్లికట్టుకి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని ఇప్పటికే ప్రకటించింది. 
ప్రస్తుతానికి జల్లికట్టుపై నిషేధం లేదు గనుక, జల్లికట్టు అనేది ఓ 'సెంటిమెంట్‌'గా మారిపోయిన దరిమిలా.. తమిళనాడు వ్యాప్తంగా ఈసారి జల్లికట్టు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆ పోటీల్లో ఈసారి సినీ గ్లామర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, విశాల్‌, లారెన్స్‌ తదితర హీరోలే కాదు, పలువురు హీరోయిన్లూ జనవరి 7 నుంచి ప్రారంభం కానున్న జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment