Friday, December 22, 2017

స్టార్ డైరెక్టర్.. పైరసీ వెబ్ సైట్‌‌ను వేడుకున్నాడు

ఇండస్ట్రీ జనాలు పైరసీ గురించి ఆవేదన వ్యక్తం చేయడం.. ఆగ్రహంగా మాట్లాడటమే చూస్తుంటాం. కానీ ఒక స్టార్ డైరెక్టర్ తమ సినిమాను పైరసీ చేయొద్దంటూ ఒక వెబ్ సైట్ వాళ్లను వేడుకోవడం ఎప్పుడైనా చూశారా..? కోలీవుడ్లో ఇదే జరిగింది. ‘తనీ ఒరువన్’ సినిమాతో దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు మోహన్ రాజా. ఆ సినిమా తర్వాత హడావుడి పడకుండా బాగా టైం తీసుకుని శివ కార్తికేయన్ హీరోగా ‘వేలైక్కారన్’ (పనివాడు అని అర్థం) అనే సినిమా తీశాడు రాజా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మోహన్ రాజా మాట్లాడుతూ.. తమిళంలో పైరసీకి బాగా పేరొందిన ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్ వాళ్లను పొగుడుతూ.. వాళ్లకు ఓ విజ్నప్తి చేశాడు.

‘వేలైక్కారన్’ అనేది ఈ లోకంలో పని చేసి బతికే ప్రతి ఒక్కరి గురించి తీసిన సినిమా అని.. ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్ నడిపేవాళ్లు కూడా మంచి పనిమంతులని.. వాళ్లు ఎంతో కష్టపడి సినిమాల్ని పైరసీ చేసి అప్ లోడ్ చేస్తారని.. వాళ్ల లాంటి పనిమంతుల గురించి తీసిన సినిమా కాబట్టి.. ‘వేలైక్కారన్’ సినిమా పైరసీ ప్రింట్ పెట్టే విషయంలో కొంచెం వెయిట్ చేయాలని.. కొంచెం ఆలస్యంగా ఈ సినిమాను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని రాజా అన్నాడు. ఈ కామెంట్స్ కోలీవుడ్లో సంచలనం సృష్టించాయి. పైరసీ విషయంలో తమిళ సినిమాల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో చెప్పడానికిది రుజువు. ఎలాంటి సినిమా అయినా సరే.. రిలీజైన రోజు రాత్రికే ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్లో వచ్చేస్తుంది. ఆ వెబ్ సైట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా వేరే మార్గాల ద్వారా పైరసీ ప్రింట్ అందుబాటులోకి తెస్తుంటారు ఈ వెబ్ సైట్ నిర్వాహకులు. కొన్ని సినిమాలకు ముందు టైం ఫిక్స్ చేసి మరీ సినిమాను రిలీజ్ చేస్తుంటారు.

No comments:

Post a Comment