Friday, December 15, 2017

పార్టీ ఆఫీసు వివాదంపై పవన్ క్లారిటీ

మొన్ననే ప్రజల్లోకి వెళ్లొచ్చి ఏపీలో తన పార్టీ ఆఫీసు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ ఆఫీసు కోసం లీజుకు తీసుకున్న స్థలం విషయంలో వివాదమేర్పడింది. అయితే... పవన్ ఈ విషయంలో స్పందించారు. ఈ వివాదం ముదరకుండా, తనపై ఆ వివాద ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు.

ఏపీ రాజధాని సమీపంలో పార్టీ కార్యాలయం నిర్మాణం నిమిత్తం మంగళగిరిలోని చినకాకానిలో మూడు ఎకరాల స్థలాన్ని జనసేన పార్టీ లీజ్ కు తీసుకుంది. యార్లగడ్డ సాంబశివరావు అనే వ్యక్తి నుంచి ఈ స్థలం లీజుకు తీసుకున్నారు. కానీ... స్థలం తమదని, ఇది వివాదంలో ఉందని అంజుమన్ ఇస్లామిక్ కమిటీ, షేఫ్ షఫీ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ దీనిపై స్పందించారు.  అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, ఈ వివాదం నిజమైతే లీజ్ రద్దు చేసుకుంటామని ప్రకటించారు.

స్థలం లీజుకు తీసుకున్నప్పుడే తాము పత్రికా ప్రకటన ఇచ్చామని, అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే బాగుండేదని పవన్ ఆ ప్రకటనలో అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయవేత్తను ముందు పెట్టి మీడియా ముందుకు రావడం అనుమానాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నిజానిజాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే న్యాయ నిపుణులతో కలసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, సంబంధిత డాక్యుమెంట్లను వారికి ముస్లిం పెద్దలు ఇవ్వాలని కోరారు. ఆ స్థలం వారిదని నిర్ధారణ అయిన మరుక్షణమే జనసేన పార్టీ ఆ స్థలానికి దూరంగా ఉంటుందని ఆ ప్రకటనలో పవన్ హామీ ఇచ్చారు. అయితే.. ఒకవేళ ఇందులో రాజకీయ కుట్ర ఉంటే కనుక పోరాడుతానని ఆయన తన ప్రకటనలో వెల్లడించారు.

No comments:

Post a Comment