Monday, July 1, 2019

విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం... బౌండరీ ఒక్కో వైపు ఒక్కోలా.. ఇలాగైతే స్పిన్నర్లు ఏంచేయగలరు?"

 ఇంగ్లండ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ పెదవి విరిచాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌టో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.  జానీ బెయిర్‌స్టో సెంచరీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు, 27 ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ- "టాస్ కీలకం, ముఖ్యంగా బౌండరీ అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు" అన్నాడు. ఫ్లాట్ పిచ్‌పై బౌండరీ మరీ దగ్గరగా ఉండటం విచిత్రమని, సరిగా ఆడని షాట్లకు కూడా బంతి బౌండరీ దాటిపోతోందని అతడు అసంతృప్తి వ్యక్తంచేశాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బెయిర్‌స్టో తన 111 పరుగుల్లో 60 పరుగులు సిక్సర్ల రూపంలోనే చేశాడు.  ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో బౌండరీ వికెట్ల నుంచి సరైన దూరంలో లేదని, కొన్ని వైపుల మరీ దగ్గరగా, మరికొన్ని వైపుల మరీ దూరంగా ఉందని కోహ్లీ చెప్పాడు. "ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్ రివర్స్ స్వీప్‌తో కేవలం 59 మీటర్ల దూరం బంతిని పంపి సిక్స్‌గా మలచగలగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్లు చూపగలిగే ప్రభావం అంతంతమాత్రమే" అని అతడు వ్యాఖ్యానించాడు. ఇంకోవైపు బౌండరీ 82 మీటర్లు ఉందని కోహ్లీ ప్రస్తావించాడు. బంతి 'లైన్' విషయలో బౌలర్లు మరింత చురుకుగా వ్యవహరించి ఉండాల్సి ఉందని, కానీ బౌండరీ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్లు చేయగలిగింది కూడా అంతగా ఉండదని చెప్పాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 102 పరుగులతో, కోహ్లీ 66 పరుగులతో రాణించారు. కానీ భారత్ ఏ దశలోనూ కొట్టాల్సిన రన్‌రేట్‌ను అధిగమించలేకపోయింది. 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ అందుకొని ఉంటే ప్రపంచ కప్‌లో అదో రికార్డు ఛేదన అయ్యేది. england batsman భారత్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ ఉంది. అది చివరి ఓవర్ మొదటి బంతికి మహేంద్ర సింగ్ ధోనీ కొట్టాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఫోర్లు 35 ఉన్నాయి.  ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు.. ఫలితాలు  జూన్ 5 భారత్ Vs దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలుపు జూన్ 9 భారత్ Vs ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో భారత్ విజయం జూన్ 13 భారత్ Vs న్యూజిలాండ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు జూన్ 16 భారత్ Vs పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం జూన్ 22 భారత్ Vs అఫ్ఘానిస్తాన్ 11 పరుగుల తేడాతో భారత్ గెలుపు జూన్ 27 భారత్ Vs వెస్టిండీస్ 125 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం జూన్ 30 భారత్ Vs ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం "ప్రతీ జట్టు ఒకటో, రెండో మ్యాచ్‌లు ఓడిపోయింది. ఎవరూ ఓడిపోవాలనుకోరు. కానీ ఓటమిని అంగీకరించకతప్పదు. మేం బాగా ఆడుతున్నాం. ఛేంజింగ్ రూమ్‌లో కూడా అందరిలో అదే ఉత్సాహం ఉంది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ముందుకు సాగుతాం" అని కోహ్లీ చెప్పాడు.  ఇంగ్లండ్ 360 పరుగుల దిశగా సాగుతున్నట్లు ఒక దశలో తనకు అనిపించిందని, కానీ తాము పుంజుకొని 337 పరుగులకు కట్టడి చేశామని అతడు తెలిపాడు. అప్పుడు తమకు సంతోషంగానే అనిపించిందని చెప్పాడు. బ్యాటింగ్ మరింత బాగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ- పిచ్‌లు ఎక్కడన్నది నెలల ముందే నిర్ణయమైపోతుందని చెప్పారు.

No comments:

Post a Comment