Tuesday, July 23, 2019

రజనీకి ఇంత ధైర్యం ఎప్పుడొచ్చేసింది?

సూపర్ స్టార్ రజనీకాంత్ తెరమీద చాలా అగ్రెసివ్‌గా ఉండే పాత్రలు వేస్తుంటారు. ఆయన ఎవరికీ భయపడరు. ఎవ్వరినైనా ఎదిరిస్తారు. పంచ్ డైలాగులు వేయడంలో ఆయనకు తిరుగుండదు. కానీ ఇదంతా వెండితెర వరకే. సినిమాల్లో మాదిరే నిజ జీవితంలోనూ ఉండాలని ఎవ్వరూ అనరు. కానీ కొంతలో కొంత దూకుడు ఉండాలని.. ముక్కుసూటిగా మాట్లాడాలని.. ముఖ్యమైన అంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటారు జనాలు.

అందులోనూ రాజకీయాల్లోకి రావాలనుకున్నాక అయినా కొంచెం దూకుడు ఆశిస్తారు. కానీ రజనీకాంత్ మాత్రం చాలా సుతిమెత్తగా మాట్లాడతారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. ఏ వివాదాస్పద అంశం మీదా తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా చెప్పరు రజనీ.

ఓవైపు రజనీ మిత్రుడైన కమల్ హాసన్ ఎంతో దూకుడుగు మాట్లాడుతుంటే.. రజనీ మాత్రం ఎప్పుడూ డిప్లమాటిగ్గా మాట్లాడటానికి ప్రయత్నించడం ఆయన అభిమానుల్ని సైతం నిరాశకు గురి చేస్తుంటుంది. ఐతే రాజకీయారంగేట్రానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రజనీలో కొంచెం మార్పు వస్తున్నట్లుంది.

ఈ మధ్య ఆయన వివాదాస్పద అంశాలపై కాస్త స్పందిస్తున్నారు. తాజాగా హీరో సూర్య జాతీయ విద్యా విధానాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన్ని టార్గెట్ చేశారు. దీని గురించి మాట్లాడే అర్హత సూర్యకు లేదన్నారు. దీనికి సూర్య దీటుగా బదులిచ్చాడు కూడా.

ఐతే తాజాగా సూర్య సినిమా ‘కాప్పన్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రజనీ.. ఆశ్చర్యకరంగా సూర్యపై వచ్చిన విమర్శలపై స్పందించారు. సూర్య సొంతంగా అగరం ఫౌండేషన్ పెట్టి ఎంతోమందికి విద్య అందిస్తున్నారని.. అలాంటి వ్యక్తికి విద్య గురించి మాట్లాడే అర్హత లేదనడం సమంజసం కాదని.. ఆయన నూటికి నూరు శాతం దీనిపై స్పందించవచ్చని అన్నాడు రజనీ. మామూలుగా ఏదైనా కాంట్రవర్శీలపై మీడియా వాళ్లు గుచ్చి గుచ్చి అడిగినా స్పందించని రజనీ.. అడక్కముందే ఈ ఇష్యూ మీద ఇలా తన అభిప్రాయం చెప్పడం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

No comments:

Post a Comment