Wednesday, July 3, 2019

విలేకరి ప్రశ్న.. జీవిత రాజశేఖర్‌ అసహనం

‘కల్కి’ సినిమాకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు రాజశేఖర్‌ భార్య జీవిత‌. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి’ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. ‘మీరు ‘కల్కి’ సినిమా దర్శకత్వం బాధ్యతల్లో జోక్యం చేసుకున్నారటగా?’ అని ప్రశ్నించారు.
దాంతో జీవిత కాస్త నొచ్చుకున్నారు. ‘ముందుగా మీడియా వర్గాలను నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ‘కల్కి’ సినిమాకు అయిన ఖర్చు దాదాపు రూ.20 కోట్ల పైనే. అలాంటప్పుడు సినిమాను నిర్మించే బాధ్యతలు తీసుకునేవారికి తెరకెక్కించిన విధానం నచ్చాలా లేదా?. ముందు మా బృందంలో ఉన్న పది మందికి నచ్చితేనే కదా మరో పది కోట్ల మందికి నచ్చుతుంది? నేనేమీ తెలీనిదాన్ని కాను. ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగుతున్నాం. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం మాకు లేదు. నేను తీసిన సినిమాలు ఆడినా ఆడకపోయినా నాకు దర్శకత్వంపై పట్టు ఉన్న సంగతి వాస్తవం. నాకున్న అనుభవంలో ఎలాంటి తప్పులు ఉండవు’
‘సినిమా నాదైనప్పుడు నేను దాని గురించి ఎందుకు పట్టించుకోను? ఎందుకు మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఇలాంటి ప్రశ్నలు అడిగాలనుకున్నప్పుడు.. ‘మీరు దర్శకత్వ పరంగా జాగ్రత్తలేమైనా తీసుకున్నారా? లేదా సలహాలు ఇచ్చారా?’ ఈ విధంగా అడగాలి. నేనేమన్నా సలహాలు ఇచ్చి ఉంటే ఆ సలహాలేంటో మీరు అడిగి తెలుసుకోకుండా ‘ఎందుకు జోక్యం చేసుకున్నారు?’ అని ప్రశ్నించకూడదు. అది సబబు కాదు. నేను మీతో గొడవ పడటంలేదు. ఇలాంటి కొన్ని విషయాలు బాధ కలిగిస్తుంటాయి అని చెప్తున్నాను’ అని వెల్లడించారు

No comments:

Post a Comment