Wednesday, July 24, 2019

జగన్ వద్ద పని కోసం... శ్రీలక్ష్మీ కష్టాలు చూశారా?

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీకి బదిలీ చేయించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో వెలుగుచూసిన ఓబుళాపురం మైనింగ్ కుంభకోణంలో ఏకంగా నెలల తరబడి జైలులోనే గడిపిని శ్రీలక్ష్మీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

కనీసం నడవలేక కుర్చీకే పరిమితమైన స్థితిలో ఆమె జైలు నుంచి విడుదలైన సందర్భం జనానికి కన్నీళ్లు తెప్పించింది. ఆ తర్వాత భర్త సహకారంతో త్వరగానే కోలుకున్న శ్రీలక్ష్మీ... రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కేడర్ ను ఎంచుకుని హైదరాబాద్ లోనే ఉండిపోయారు.

అయితే ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్ తనయుడు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడంతో ఏపీలోనే పనిచేసేందుకు... ప్రత్యేకించి జగన్ వద్ద పనిచేసేందుకు శ్రీలక్ష్మీ ఆసక్తి చూపారు.

ఎన్నికల్లో గెలిచిన వెంటనే జగన్ తో ఆమె ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని శ్రీలక్ష్మీ చెప్పగా... జగన్ కూడా అందుకు సరేనన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మీ పెట్టుకున్న డిప్యూటేషన్ వినతిని మాత్రం కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండి ఇప్పటికే దాదాపుగా రెండు నెలలు కావస్తోంది.

ఈ ఆలస్యం ఏమిటంటూ శ్రీలక్ష్మీ కలత చెందుతున్నట్లుగానూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లైఫ్ లో చాలా నష్టపోయానన్న భావనతో ఉన్న శ్రీలక్ష్మి... డిప్యూటేషన్ పై కేంద్రం వద్దే తేల్చుకుందామంటూ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో నేరుగా ఢిల్లీలో ల్యాండైన శ్రీలక్ష్మీ... పార్లమెంటులో ప్రత్యక్షమయ్యారు.

పార్లమెంటు ఆవరణలో అడుగుపెట్టిన శ్రీలక్ష్మీ... తన డిప్యూటేషన్ చూసే కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తన డిప్యూటేషన్ పై సానుకూలంగా స్పందించాలని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆమె అమిత్ షాను కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా... పార్లమెంటులోనే ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డిని కూడా ఆమె కలిశారట. తన డిప్యూటేషన్ ను కాస్తంత పట్టించుకోండంటూ ఆమె సాయిరెడ్డిని కోరారట.

శ్రీలక్ష్మీ నేరుగా కోరిన నేపథ్యంలో అమిత్ షాతో పాటు సాయిరెడ్డి ఏం చేస్తారో తెలియదు గానీ... ఏపీకి డిప్యూటేషన్ తనకు అత్యంత అవసరమని, జగన్ సర్కారులో తాను కీలక భూమిక పోషించాలనుకుంటున్న విషయాన్ని శ్రీలక్ష్మీ ఈ చర్య ద్వారా చెప్పినట్టైందన్న వాదన వినిపిస్తోంది.

No comments:

Post a Comment