Friday, July 26, 2019

అరవింద్ కన్నా ముందే తీసేసారే

మనదైన కథలను భారీ ఖర్చుతో బడా స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు. అందులో సిజి వర్క్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ జోడిస్తే ఆ అందమే వేరు. అందుకే బాహుబలి లాంటి జానపదకథను జనం నెత్తిన పెట్టుకున్నారు. బాహుబలి తరువాత చాలామంది దృష్టి మహాభారతం మీద పడింది. ఎందుకంటే ఎంత భారీ అయినా లిమిట్ లెస్ గా చూపించవచ్చు భారతాన్ని. రాజమౌళి కూడా తన లాస్ట్ సినిమా మహాభారతమే అన్నారు. అల్లు అరవింద్ అయితే వివిధ భాషల్లో కొంతమంది బడా నిర్మాతలతో కలిసి రామాయణం తనిర్మాణానికి అంకురార్పణ కూడా చేసారు.
కానీ ఇప్పుడు కన్నడంలో కురుక్షేత్రం పేరిట మహాభారతం సినిమాను భారీగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించి తీసేసారు, విడుదల చేసేస్తున్నారు కూడా. సౌత్ ఇండియాకు చెందిన హేమాహేమీ నటులు అంతా ఈ సినిమాలో నటించేసారు. కన్నడ నటుడు దర్శన్ (దుర్యోధనుడు) సీనియర్ అర్జున్ (కర్ణుడు) సోనూసూద్ (అర్జునుడు), రవిచంద్రన్ (కృష్ణుడు) స్నేహ(ద్రౌపది)గా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే 1970 నుంచి ఇప్పటివరకు వున్న చాలామంది ప్రముఖనటులు ఈ సినిమాలో నటించేసారు.
తెలుగు నిర్మాతలకు కూడా సుపరిచితమైన రాక్ లైన్  వెంకటేష్, మునిరత్నం ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేసారు. సరే, నటీనటుల్లో కొందరి ఫేస్ లు మన జనాలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్, యస్వీఆర్, ఇలా చాలామంది గొప్పవాళ్లను మనజనాలు పౌరాణికపాత్రల్లో చూసి వున్నారు కదా? ఆ విషయం పక్కనపెడితే ట్రయిలర్ లో విఎఫ్ఎక్స్ పనితనం మాత్రం ఒక రేంజ్ లో వుంది.
ముఖ్యంగా కురుక్షేత్రం అని టైటిల్ పెట్టినందుకు, యుద్దకాండ మొత్తం ఆధునిక సాంకేతికతను జోడించి తీసిన తీరు ట్రయిలర్ లో బాగానే ప్రొజెక్ట్ చేసారు. ఈ సినిమా ట్రయిలర్ విడుదల కార్యక్రమానికి నిర్మాతలు బన్నీ వాసు, బివివిఎస్ఎన్ ప్రసాద్, సినిమా నిర్మాత మునిరత్న, సోనూ సూద్, సీనియర్ అర్జున్, దర్శన్, రచయిత వెన్నెల కండి, రాక్ లైన్ వెంకటేష్, సినిమా దర్శకుడు నాగన్న పాల్గొన్నారు.

No comments:

Post a Comment